ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి
ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి
పెనమలూరు ప్రజలకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సూచనలు
పెనమలూరు, ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ దాదాపు 48 డిగ్రీల వరకు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సూచించారు.
తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బ, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు లేకపోతే ఇంటి బయటకు రావద్దని సూచించారు.
ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు వీలైనంతవరకు తమ కార్యాలయాలు లేదా పని ప్రాంతాల్లోనే ఉండాలని, ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తపడాలని పేర్కొన్నారు.
శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు తరచుగా మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎండభారం నుంచి రక్షణ పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు.
