టెక్‌ట్రిక్స్ ఎక్స్‌పో.. స్టార్ట‌ప్‌ల‌కు సువ‌ర్ణావ‌కాశం..

టెక్‌ట్రిక్స్ ఎక్స్‌పో.. స్టార్ట‌ప్‌ల‌కు సువ‌ర్ణావ‌కాశం..

యువ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హించేందుకు స‌రికొత్త ప్ర‌యత్నం
స్థానిక ఆలోచనలు, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లేలా ప్ర‌ద‌ర్శ‌న‌
ఒకే వేదిక‌పై స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప‌రిష్కారాలెన్నో
ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ సాంకేతిక దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వహించిన టెక్‌ట్రిక్స్ 2026 స్టార్ట‌ప్ ఎక్స్‌పో యువ పారిశ్రామిక వేత్త‌ల‌కు సువ‌ర్ణావ‌కాశంగా నిలుస్తోంద‌ని.. స్థానిక ఆలోచ‌న‌లు, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఈ ఎక్స్‌పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచ‌న‌లు, సాంకేతిక ప‌రిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయ‌ని తెలిపారు.

జాతీయ సాంకేతిక దినోత్స‌వం సంద‌ర్భంగా ఎనికేపాడులోని విజ‌య‌వాడ ర‌త‌న్ టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్ లో సోమ‌వారం జిల్లా అధికార యంత్రాంగం, ఆర్‌టీఐహెచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టెక్‌ట్సిక్స్ 2026 (స్టార్ట‌ప్ ఎక్స్‌పో)ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. ఆర్‌టీఐహెచ్ సీఈవో జి.కృష్ణ‌న్‌, అధికారుల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ స్థానిక స్థాయిలో పుట్టుకొచ్చే ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సరైన మార్గదర్శ‌కత్వం, మార్కెట్ అవ‌కాశాలు, సాంకేతిక సహ‌కారం ల‌భిస్తే అవి అంతర్జాతీయ స్థాయికి ఎదగగలవన్నారు.

యువ‌త‌లో ఉన్న సృజ‌నాత్మ‌క‌త‌ను వెలికితీసి, ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా ఈ తరహా వేదికలు దోహదపడతాయని అన్నారు. ఎక్స్‌పోలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు, మహిళా సాధికారత వంటి విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్ట‌ప్‌లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయ‌ని.. సాంకేతికతను సామాన్య ప్రజల జీవితాలతో అనుసంధానం చేస్తూ యువత రూపొందించిన ప్రాజెక్టులు ఆక‌ట్టుకున్నాయ‌న్నారు. జిల్లాలో ఇన్నోవేషన్, స్టార్ట‌ప్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు.

విక‌సిత్ భార‌త్‌, స్వర్ణాంధ్ర సాకారం దిశ‌గా..

న‌వ్య రాజ‌ధాని అమ‌రావ‌తికి గేట్‌వేగా ఉన్న విజ‌య‌వాడ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అపార అవ‌కాశాలున్నాయ‌ని.. ర‌త‌న్ టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్ స్పోక్ న‌గ‌రంలో ఉండ‌టం వ‌ర‌మ‌ని, దీనిద్వారా ఇప్ప‌టికే 500 వ‌ర‌కు స్టార్ట‌ప్‌ల‌కు చేయూత‌నివ్వ‌డం జ‌రిగింద‌ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ పేర్కొన్నరు.. విద్యార్థులు, యువ‌త ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ తోడుగా.. అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లవచ్చో ఇలాంటి వేదిక‌ల ద్వారా అవగాహన కల్పించడం జ‌రుగుతోంద‌న్నారు.

​ప్రతిభను గుర్తించడమే కాదు.. వారిని ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను కూడా అందించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఉత్త‌మ స్టార్టప్‌లుగా నిలిచిన వారికి వరుసగా రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేల బహుమతులను ప్ర‌క‌టించిన‌ట్లు వెల్ల‌డించారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను సమర్థంగా వాడుకుంటూ స్థానిక ఆలోచనలను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లేలా ఈ ఎక్స్పో ఒక మార్గదర్శిగా నిలవనుందని పేర్కొన్నారు.

ప్ర‌భుత్వ పోత్రాహాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి.

కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తోందని కలెక్టర్ ల‌క్ష్మీశ తెలిపారు. యువత తమలోని ప్రతిభను వెలికితీసి స్టార్టప్‌ల రూపంలో సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తులు, సేవలు అందించాలని సూచించారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే మరిన్ని వినూత్న ఆలోచనలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. అప్పుడే బ‌హుళ ప్ర‌యోజ‌నాల గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త అయిన ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కార్యాచ‌ర‌ణ స‌ఫ‌లీకృత‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు.

యువ మేధ‌స్సుకు ప్ర‌తిరూపాలు..

టెక్ ట్రిక్స్ స్టార్ట‌ప్ ఎక్స్‌పోలో దాదాపు 120 స్టార్ట‌ప్‌ల ప్ర‌ద‌ర్శ‌న యువ మేధ‌స్సుకు ప్ర‌తిరూపాలుగా నిలిచాయి. త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డుతూ ప‌దుల సంఖ్య‌లో మ‌రో ప‌ది మందికి ఉపాధి క‌ల్పించాల‌నే దృఢ సంక‌ల్పంతో రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపించేలా యువత రూపొందించిన పరికరాలు, ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

చిన్నారుల్లో తేలిగ్గా అభ్య‌స‌న నైపుణ్యాలు పెంపొందించే ఈజీ స్లేట్ (ఈజీ లెర్నింగ్‌, ఈజీ గ్రాఫింగ్‌), డీప్ ల్యూర్‌, సేంద్రియ సాగుకు ఉప‌యోగ‌ప‌డే డ‌బుల్ ప‌వ‌ర్ పంప్‌సెట్ స్ప్రేయ‌ర్‌, అడ్వాన్స్‌డ్ యాక్సిడెంట్ ప్రివెన్ష‌న్ అండ్ డిటెక్ష‌న్ టెక్నాల‌జీ, ఎవే స్పేస్ కోవెనంట్ (స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాల‌జీ), షేపింగ్ ది ఫ్యూచ‌ర్ విత్ సీ వీడ్‌, డీ హైడ్రేటెడ్ విజిట‌బుల్స్‌, ఫ్రూట్ పౌడ‌ర్స్‌, హైడ్రాలిక్ లిఫ్ట్, జెన్ సైన్స్ వంటి సంస్థ‌లు, స్టార్ట‌ప్‌ల ప్ర‌ద‌ర్శ‌న ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు, సంద‌ర్శ‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా రాష్ట్రం, దేశ అభివృద్ధికి యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply