జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తరలించాలి..
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తరలించాలి..
- అఖిలపక్ష సమీక్షా సమావేశంలో
- మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి డిమాండ్..
జవహర్ నగర్, ఆంధ్రప్రభ : జవహర్ నగర్ డివిజన్ ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఇక్కడి నుండి తక్షణమే తరలించాలని మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగోల్‌లో నిర్వహించిన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి అఖిలపక్ష సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను మల్లారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా స్థానిక ప్రజలు పడుతున్న నరకయాతనను వివరించారు.

ప్రతిరోజూ సుమారు 8,500 నుండి 12,500 టన్నుల చెత్త జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. 339 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన ఈ చెత్త పర్వతాల నుండి వెలువడుతున్న దుర్గంధపు కెమికల్ నీరు (లీచేట్) సమీపంలోని చెరువులను, బోరు బావులను పూర్తిగా కలుషితం చేస్తోంది. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యమవ్వడంతో ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కేవలం మనుషులే కాకుండా, పక్షులు, జంతువులు కూడా ఇక్కడ నివసించలేని దారుణమైన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని మరికొన్ని సమస్యలను ప్రస్తావిస్తూ.. ఇటీవల జీహెచ్ఎంసీ (GHMC) లో విలీనం చేసిన గ్రామాల్లో ఎలాంటి పన్నులు (Taxes) పెంచకుండా, పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రోడ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి, కొత్త రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఈ ఉన్నత స్థాయి అఖిలా పక్ష సమీక్షా సమావేశంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో పాటు 0పలువురు ఉన్నతాధికారులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
