ఉపాధి హామీ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఉపాధి హామీ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
- సీపీఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి డిమాండ్
ఊట్కూర్, ఆంధ్రప్రభ:
ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో పని ప్రదేశంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు, నాలుగేళ్ల కిందటి ఉపాధి హామీ వేతనాల పాత బకాయిలు ఇప్పటికీ రాకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఈ నిధులను కూలీలకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి హామీకి సంబంధించిన వారం వారం వేతన డబ్బులను గద్వాల జిల్లా బ్రాంచ్లో జమ చేస్తుండటంతో, నిడుగుర్తి గ్రామ కూలీలు అంత దూరం వెళ్లి డబ్బులు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రయాణ ఖర్చులు భారం కావడంతో పాటు సమయం వృధా అవుతోందని, కాబట్టి కూలీల వేతనాలను స్థానికంగా ఉన్న బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల ద్వారానే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రోజువారీ కూలి రూ. 600 తగ్గకుండా ఇవ్వాలని వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పని ప్రదేశాలలో కూలీలకు తాగునీరు, నీడ వసతి (టెంట్లు), ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కిట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. కూలీల సమస్యలను పరిష్కరించని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను ఏకం చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యకర్త పవన్ కుమార్ స్థానిక ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
