భారీ మొత్తంలో బంగారం, మొబైల్స్, ల్యాప్టాప్లు స్వాధీనం
భారీ మొత్తంలో బంగారం, మొబైల్స్, ల్యాప్టాప్లు స్వాధీనం
నిందితులను అరెస్టు చేసిన కర్నూలు రైల్వే పోలీసులు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను టార్గెట్ చేస్తూ బ్యాగులు అపహరించి, అందులోని బంగారం, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న నిందితులను కర్నూలు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో దొంగిలించబడిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు గుంతకల్ రైల్వే డీఎస్పీ శ్రీనివాసాచారి బుధవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు రైల్వే పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల రైళ్లలో పెరుగుతున్న చోరీ ఘటనల నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాలపై రైల్వే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని, దొంగిలించిన విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం రైల్వే పోలీసుల విజయంగా భావిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు హాజరై కవరేజ్ ఇవ్వాలని కర్నూలు గవర్నమెంట్ రైల్వే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
