రైజ్ వేదికగా స్వయం ఉపాధికి ఆసరా
రైజ్ వేదికగా స్వయం ఉపాధికి ఆసరా
శిక్షణ కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ శనివారం సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి, మహిళలతో ముచ్చటించారు. శిక్షణ పొందుతున్న మహిళలను కలెక్టర్ వారి అనుభవాలు, అభిప్రాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్యూటీషియన్, మ్యాజిక్ వీవ్స్ మెషీన్ శిక్షణ కార్యక్రమాల తీరుతెన్నులను పరిశీలించి, మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.
నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవచ్చని, కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ఇటువంటి శిక్షణలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా సింటిల్లా సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న “ఏఐ ఫర్ ష్యూర్” కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మహిళలకు అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని మహిళలకు దిశానిర్దేశం చేశారు. మహిళల సాధికారత, ఉపాధి అవకాశాల విస్తరణ దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు పాల్గొన్నారు.
