పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- అవనిగడ్డలో చెత్తాచెదారాన్ని తొలగించిన కలెక్టర్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ ప్రజలకు సూచించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం అవనిగడ్డలోని ఎల్.ఐ.సి సమీపంలో చెత్త చెదారాన్ని, ఇతర వ్యర్ధాలను జిల్లా కలెక్టర్ స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

స్వచ్ఛ కృష్ణాగా జిల్లాను తీర్చిదిద్దేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని అందించాలని కోరారు. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణపై ప్రజలు దృష్టి సారించాలని తెలిపారు.
గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతిరోజు తడి, పొడి చెత్తను వేరువేరుగా పంచాయితీ రిక్షాకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో అరుణ, జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి, ఎంపీపీ తుంగల సుమతి, ఎంపీడీవో మరియదేవి, తహసీల్దార్ అవనిగడ్డ శ్రీనివాసరావు, మండల స్థాయి వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
