మర్రి తండాలో భూతగాదాలతో రక్తపాతం..
మర్రి తండాలో భూతగాదాలతో రక్తపాతం..
- కత్తులు, కర్రలతో దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు
రాయపర్తి, ఆంధ్రప్రభ : భూ వివాదం పెను ఉద్రిక్తతకు దారితీసింది. రాయపర్తి మండలం సూర్యతండా పరిధిలోని మర్రి తండాలో ఇద్దరు అన్నదమ్ముల వర్గాల మధ్య నిన్న రాత్రి జరిగిన ఘర్షణలో కత్తులు, కర్రలు దూసుకురావడంతో గ్రామంలో కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు.గ్రామస్థుల వివరాల ప్రకారం… మర్రి తండాకు చెందిన రామావత్ గ్యాస్య, రామావత్ రేఖ్య అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి.
ఆస్తి పంపకాలు, హద్దుల విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయింది. గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.నిన్న రాత్రి వివాదం మరోసారి భగ్గుమంది. రామావత్ గ్యాస్య వర్గానికి చెందిన కిరణ్, రాజేందర్‌లతో కలిసి రామావత్ రేఖ్య వర్గంపై ఆకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రామావత్ రేఖ్య, ఆయన కుమారులు నవీన్, జీవన్‌లపై కత్తులు, కర్రలతో విరుచుకుపడ్డారు.
దాడి తీవ్రంగా ఉండడంతో ముగ్గురికీ తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడిపోయిన వారిని చూసి గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.స్థానికులు వెంటనే అప్రమత్తమై గాయపడిన వారిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మిగతా ఇద్దరు ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రాయపర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో మరింత ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
