AP | ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి

AP | ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి

  • జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  • ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వార‌ధిగా స‌మావేశం నిర్వ‌హ‌ణ‌

ఆంధ్రప్రభ విజయవాడ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించి, ప‌రిష్క‌రించేందుకు కృషిచేయ‌డం జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం క‌లెక్ట‌రేట్ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో వివిధ ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల‌ను, అభిప్రాయాల‌ను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 92 అంశాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా ఏఎన్ఎం (గ్రేడ్‌-3)ల‌పై ప‌ని ఒత్తిడి, అన్ని శాఖ‌ల్లో నాలుగో త‌ర‌గతి ఉద్యోగ ఖాళీల భ‌ర్తీ, ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు ఈహెచ్ఎస్ ప‌టిష్ట అమ‌లు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్‌లో జాప్యం, అర్హులైన వారికి కారుణ్య నియామ‌కాలు, స‌రైన విచార‌ణ లేకుండా క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం, జిల్లాస్థాయిలో క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌, బ‌స్సు డిపోల్లో మ‌హిళా ఉద్యోగుల‌కు సౌక‌ర్యాల క‌ల్ప‌న తదిత‌ర అంశాల‌ను క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ… జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సామరస్యపూర్వకమైన సంబంధాలను పెంపొందించడానికి, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటైన ఒక అధికారిక వేదిక‌ని.. ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కారాలను కనుగొనడానికి ప్రభుత్వం ప్ర‌ణాళిక ప్ర‌కారం స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, మిగిలిన అంశాలను సమావేశ మినిట్స్ రూపంలో రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

స‌మావేశంలో డీఆర్‌వో ల‌క్ష్మీన‌ర‌సింహంతో పాటు ఏపీ ఎన్‌జీజీవోస్ అసోసియేష‌న్‌, స్టేట్ టీచ‌ర్స్ యూనియ‌న్‌, ఏపీ ప్రోగ్రెసివ్ రిక‌గ్నైజ్డ్ టీచ‌ర్స్ యూనియ‌న్‌, ఏపీ యునైటెడ్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌, ఏపీ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్‌-1938, ఏపీ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌, ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్‌, ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ వెహిక‌ల్స్ డ్రైవ‌ర్స్ సెంట్ర‌ల్ అసోసియేష‌న్‌, ఆల్ ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ క్లాస్ – 4 ఎంప్లాయీస్ సెంట్ర‌ల్ అసోసియేష‌న్‌, ఏపీ కోప‌రేటివ్ స‌ర్వీస్ అసోసియేష‌న్‌, ఏపీ స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్‌, స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ పెన్ష‌న‌ర్స్ అసోసియేష‌న్‌, ఏపీ పీటీడీ నేష‌న‌ల్ మ‌జ్దూర్ యునిటీ అసోసియేష‌న్‌, ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియ‌న్ సంఘాల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.