ఏపీఎల్ నిర్వహణకు చక చకా జరుగుతున్న ఏర్పాట్లు…

ఏపీఎల్ నిర్వహణకు చక చకా జరుగుతున్న ఏర్పాట్లు…

ఏ పీ ఎల్ నిర్వహణకు గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికలు
చైర్మన్ గా సుజయ్ కృష్ణ రంగారావు ఏకగ్రీవ ఎన్నిక

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 నిర్వహణకు చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏ పి ఎల్) నిర్వహణ కోసం ప్రతి సీజన్ తరహాలోని ఈ సీజన్ కి కూడా గవర్నింగ్ కౌన్సిల్ ను ఆదివారం విజయవాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్ (ఎస్ జి ఎం) లో ఎన్నుకున్నారు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఉన్న ఓటింగ్ క్లబ్స్, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ ల ప్రతినిధులు గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికలలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకుని ఇద్దరు సభ్యులను ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నుంచి రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, కర్నూలు బ్లూస్ క్రికెట్ క్లబ్ నుంచి ఎం సురేంద్ర వర్మ లు సభ్యులుగా 2026- 27 ఏపీఎల్ సీజన్ నిర్వహణ నిమిత్తం ఎన్నికయ్యారు. అనంతరం ఏ సి ఏ ప్రతినిధుల సమావేశం జరగగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ గా సుజయ్ కృష్ణ రంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సభ్యులుగా ఎం సురేంద్ర వర్మ, సానా సతీష్ బాబు, డి శ్రీనివాస్, ఆర్ శ్యామ్, వైయస్ రంగనాథ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించగా, ఎన్నికల నిర్వహణ, అనంతరం జరిగిన సమావేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు , ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, ఏసీఏ కార్యనిర్వహక సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply