వైభవంగా శ్రీవారి తిరుప్పవడ సేవ

వైభవంగా శ్రీవారి తిరుప్పవడ సేవ

తిరుమల తరహాలో స్వామివారికి పూజలు..
వేలాది మందికి ప్రసాదాల పంపిణీ

భవానిపురం, ఆంధ్రప్రభ : నగరంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో గురువారం శ్రీవారి తిరుప్పవడ (అన్నకూటోత్సవం)ను తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. విశేషంగా అలంకరించిన స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం అన్నకూట మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి భారీ స్థాయిలో పులిహోర నైవేద్యంగా సమర్పించి తిరుప్పవడ సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాదంగా ఒక్కొక్కరికి ఒక వడ, ఒక జిలేబీతో పాటు కిలో పులిహోరను పంపిణీ చేశారు.

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. దేవస్థానం ఈవో మాట్లాడుతూ, తిరుమలలో నిర్వహించే తిరుప్పవడ సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడంతో పాటు శ్రీవారి అనుగ్రహం అందరికీ లభించాలనే సంకల్పంతో అన్నకూటోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంలో అర్చకులు, సిబ్బంది, సేవాదారులు విశేషంగా కృషి చేశారని ఆయన అభినందించారు.

Leave a Reply