ప్రజారోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా..?

ప్రజారోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా..?

-అన్నింట వైఫల్యమైన కూటమి..

-ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజారోగ్యంపై కోటమీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తీవ్ర ఆరోపణలు చేశారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలను ప్రస్తావిస్తూ, ఆసుపత్రుల్లో పర్యవేక్షణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగి భద్రత వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు బయటపడుతున్నాయని అన్నారు.

ప్రభుత్వ వైద్య సేవల్లో కనీస ప్రమాణాలు కూడా కనిపించడం లేదని విమర్శించారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, ఏసీలు, అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆయన ఆరోపించారు. రోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు తరలించాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులే మోయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వైద్యశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం వల్ల పేద ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని, ముఖ్యంగా కరోనా సమయంలో వైద్య వ్యవస్థను సమర్థంగా నడిపించారని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆరోగ్య సేవల విస్తరణ, మౌలిక సదుపాయాల పెంపు, వైద్య సేవల అందుబాటులో గత పాలనలో మెరుగైన చర్యలు కనిపించాయని అన్నారు.

ఇదే సమయంలో పెరిగిన ఇంధన ధరలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.3 మేర పెరిగిన నేపథ్యంలో ప్రజలపై అదనపు భారం పడిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాల మధ్య ఇంధన ధరల పెంపు సామాన్య ప్రజలు, రైతులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, వైద్యం, వ్యవసాయం, విద్య వంటి కీలక రంగాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.