పశ్చిమ అభివృద్ధే లక్ష్యం

రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం..
యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి..
తాగునీరు, ఆరోగ్యం, ఉపాధి, క్రీడలకు ప్రాధాన్యం…
రూ.27 కోట్ల ఇండోర్ స్టేడియం ప్రతిపాదన
కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి…
ప్రజల మన్ననలే అసలైన విజయం..
ఎమ్మెల్యే యులమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి

భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గం లోనే అన్ని నియోజకవర్గాలలో కన్నా ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడమే తన ముందున్న లక్ష్యం అని శాసన సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ(సుజనా) చౌదరి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, గత 12 సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా బలోపేతమైందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తాను 47 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించానని గుర్తు చేసిన ఆయన, రానున్న ఎన్నికల్లో కూటమి మరింత బలంగా, ఏకగ్రీవంగా విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తాగునీటి పైప్‌లైన్ పనులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మొబైల్ హెల్త్ బస్సులను ఏర్పాటు చేసి ముందస్తు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, ఉద్యోగాల కోసం వెతకడం మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని యువతకు సూచించారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి ముఠాల ప్రభావం ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం వాటిని పూర్తిస్థాయిలో అరికట్టగలిగామని చెప్పారు.

లేబర్ కాలనీలో రూ.27 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి పరంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముందంజలో ఉందని పేర్కొన్న సుజనా చౌదరి, ఇప్పటివరకు చేసినది ఆవగింజంత మాత్రమేనని, ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల విశ్వాసం, మన్ననలు సంపాదించడమే ప్రజాప్రతినిధుల అసలైన బాధ్యత అని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో అధికారంలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.