వడ్ల తూకాలపై రైతుల ఫిర్యాదులు..

వడ్ల తూకాలపై రైతుల ఫిర్యాదులు..

  • సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లోని కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు,మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, దేవునిగూడ ఉపసర్పంచి కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు సాయికుమార్, పలువురు రైతులు కలెక్టర్ ను కలిసి వడ్లు ప్రతి 40 కిలోల బ్యాగుకు 43 కిలోలు తూకం వేస్తున్నారని విన్నవించారు.దీంతో ప్రతి క్వింటాళ్ల వడ్లకు 5 నుంచి 6 కిలోల వరకు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల వడ్లను కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు, రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని, గోదాముల వద్ద హమాలీలను పెంచాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సమాధానం ఇస్తూ.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిందిగా సంబంధిత ఇన్చార్జీలను ఆదేశించారు.తాలు, తప్పా ఉండడం వల్ల తరుగు వస్తుందనే ఉద్దేశంతోనే వడ్లు 40 కిలోల బస్తా ఒకంటికి ఒక్క కిలో ఎక్కువ తూకం వేస్తున్నారని ఆయన సమాధానం ఇచ్చారు.

వడ్ల బస్తాల తరలింపులో వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.అనంతరం మండలంలోని మొర్రిగూడ సమీపాన ఉన్న శ్రీ రాఘవేంద్ర రైస్ మిల్లును ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు,జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ,స్థానిక తాహసిల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, గ్రామ సర్పంచి జక్కు సుష్మ- భూమేష్, తదితరులు పాల్గొన్నారు.