స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ‘చలో ఏఎంఆర్’ ఉద్యమం: బీజేపీ హెచ్చరిక

మంథని (ఆంధ్రప్రభ): తాడిచర్ల ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏఎంఆర్ (AMR) సంస్థ స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించకపోతే “చలో ఏఎంఆర్” పేరుతో భారీ ఉద్యమం చేపడతామని బీజేపీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్‌రెడ్డి హెచ్చరించారు. మంథనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ప్రజలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను కోల్పోయి సంస్థకు అప్పగించినప్పటికీ, వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. డ్రైవర్, సూపర్వైజర్ వంటి సాధారణ ఉద్యోగాల కోసం పలుమార్లు కంపెనీ అధికారులను సంప్రదించినా స్పందన లేదని విమర్శించారు.

కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి, వారికి కూడా నెలకు రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని, ఆ జీతాలతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందన్నారు. తాడిచర్ల ప్రాంతం బొగ్గు ఉత్పత్తికి కేంద్రంగా ఉన్నప్పటికీ, ఆ ప్రాంత అభివృద్ధిని ఏఎంఆర్ సంస్థ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంస్థ తన విధానాన్ని మార్చుకుని స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, లేకపోతే నియోజకవర్గ యువతతో కలిసి “చలో ఏఎంఆర్” ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే ఈ అంశాన్ని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామని, స్థానికుల హక్కులు, ఉద్యోగాల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.