ఆప్మెల్‌లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
సింగరేణి అనుబంధ సంస్థలో 300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
గోదావరిఖని, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఆప్మెల్–సింగరేణి అనుబంధ సంస్థ)లో మొట్టమొదటిసారిగా 300 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి బుధవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు.
విజయవాడలోని ఆప్మెల్ సంస్థలో సింగరేణి బొగ్గు పరిశ్రమకు 85 శాతం వాటా ఉంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో సింగరేణితో పాటు అనుబంధ సంస్థ అయిన ఆప్మెల్‌ను బహుముఖంగా అభివృద్ధి చేసే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి తెలిపారు.
ఆప్మెల్ ప్లాంట్, కాలనీ విద్యుత్ అవసరాల కోసం సంస్థ ప్రతి ఏడాది సుమారు రూ.60 లక్షల మేర విద్యుత్ బిల్లులు చెల్లిస్తోందన్నారు. రూ.1.24 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సోలార్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు రూ.24 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని, ఐదేళ్లలో పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.
ఆప్మెల్ చైర్మన్ ఎన్‌వీకే శ్రీనివాస్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో సంస్థ అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికలను వివరించారు. సింగరేణి, కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ సంస్థల నుంచి లభించిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేసినట్లు వెల్లడించారు.
