చెన్నూర్ రోడ్డు విస్తరణలో వ్యాపారులకు ఊరట

చెన్నూర్ రోడ్డు విస్తరణలో వ్యాపారులకు ఊరట

  • 5 ఫీట్ల మినహాయింపు
  • బాధితులకు టీడీఆర్ కార్డులు, ప్రత్యామ్నాయ షాపులు
  • అభివృద్ధికి సహకరించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో సాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో స్థానిక వ్యాపారుల విన్నపం మేరకు 5 ఫీట్ల మేర మినహాయింపు ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి శ్రీనివాస్ పద్మతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాన్ని సుందరీకరించే క్రమంలో రోడ్డు విస్తరణ అనివార్యమని, అయితే ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అధికారులు మొదట 60 ఫీట్ల విస్తరణకు ప్రతిపాదించినప్పటికీ, వ్యాపారస్తుల వినతిని పరిగణనలోకి తీసుకుని దానిని 55 ఫీట్లకు కుదించినట్లు వెల్లడించారు. ఎవరైతే స్థలాలు కోల్పోతున్నారో వారికి టి.డి.ఆర్ (TDR) ఇవ్వడంతో పాటు, మున్సిపాలిటీలో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి బాధితులకు ప్రత్యామ్నాయ దుకాణాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా రోడ్డు విస్తరణ చేసి బాధితులకు నేటికీ నష్టపరిహారం అందించలేదని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బాధితులకు పూర్తి అండగా ఉంటుందని, ఇప్పటికే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని తెలిపారు. రోడ్డు విస్తరణపై వచ్చే అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

అనంతరం వరి ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి మరియు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు.

Leave a Reply