Risk100% | అవకాశాలా? ప్రమాదాలా?
Risk100% | అవకాశాలా? ప్రమాదాలా?
Risk100% | యువతలో డేటింగ్ యాప్‌లపై పెరుగుతున్న ఆకర్షణ
ఆన్‌లైన్ పరిచయాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలు
విశాఖ ఘటనతో వెలుగులోకి వచ్చిన భయానక వాస్తవం
జాగ్రత్తలే రక్షణ – పోలీసులు, నిపుణుల సూచనలు
Risk100% | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆధునిక జీవన శైలిలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఆ ప్రభావంలో భాగంగానే ఇప్పుడు డేటింగ్ యాప్‌లు యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. ఒకప్పుడు పరిచయాలు కుటుంబం, స్నేహితుల వలయంలోనే పరిమితమైతే… ఇప్పుడు మొబైల్‌లో ఒక క్లిక్‌తో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి.

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల ద్వారా కొత్త పరిచయాలు, స్నేహం, ప్రేమ—all in one అన్నట్టుగా యువత వీటివైపు ఆకర్షితులవుతున్నారు. కానీ ఇదే మార్గం చాలా సందర్భాల్లో ప్రమాదాలకు దారి తీస్తోందన్నది ఆందోళన కలిగించే విషయం. మొదట్లో డేటింగ్ యాప్‌లలో పరిచయాలు చాలా సహజంగా, ఆకర్షణీయంగా మొదలవుతాయి. అభిరుచులు కలవడం, మాటలు కలవడం, చాట్‌లు పెరగడం… ఇలా నెమ్మదిగా దగ్గరవుతారు.
దూర ప్రాంతాల్లో ఉన్నవారైనా ఒకే చోట కలుసుకునేంతవరకు పరిచయం పెరుగుతుంది. అయితే ఈ పరిచయాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునే లోపే, చాలామంది భావోద్వేగాలకు లోనవుతున్నారు. కొంతకాలం తర్వాత అభిప్రాయ భేదాలు, అనుమానాలు, డబ్బు లావాదేవీలు—ఇవి వచ్చేసరికి సమస్యలు మొదలవుతాయి.

కొన్ని కేసుల్లో ఈ పరిచయాలు ఆర్థిక మోసాలు, బ్లాక్‌మెయిలింగ్, హింసాత్మక ఘటనలు వరకు దారి తీస్తున్నాయి. “ప్రేమ” పేరుతో ప్రారంభమైన పరిచయం… చివరికి “ప్రమాదం”గా మారుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. యువతలో ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఆందోళనలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు ఎంతవరకు సురక్షితం? నిజమైన సంబంధమా? లేక వేరే ఉద్దేశ్యాల కోసమా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి డేటింగ్ యాప్‌లు స్వతహాగా తప్పు కావు. కానీ వాటిని ఉపయోగించే విధానం కీలకం. సరైన అవగాహన లేకపోతే అవే ప్రమాదాలకు కారణమవుతాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బయటపడుతున్న కేసులు చూస్తే ఈ విషయంపై మరింత జాగ్రత్త అవసరం అనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని మోసాలు, దారుణ ఘటనలకు పాల్పడిన కేసులు బయటపడటం కలవరపెడుతోంది.

విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. డేటింగ్ యాప్‌లో ఏర్పడిన పరిచయం కాస్తా చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖ నగరానికి చెందిన ఒక మహిళకు, ఇండియన్ నేవీలో పనిచేస్తున్న వ్యక్తితో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారింది. కానీ ఆ సంబంధంలో వచ్చిన విభేదాలు చివరికి దారుణానికి దారి తీశాయి.
ఆ వ్యక్తి మహిళను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి దాచిపెట్టిన ఘటన వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు డేటింగ్ యాప్‌లలో ఉన్న చీకటి కోణాన్ని బయటపెట్టింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ… “అపరిచితులతో ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకునేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. వ్యక్తిగత వివరాలు పంచుకోవడం, ఒంటరిగా కలవడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై కాస్త దృష్టి పెట్టాలి. వారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలాంటి యాప్‌లు ఉపయోగిస్తున్నారు? అనే విషయాల్లో అవగాహన కలిగి ఉండటం అవసరం. మొత్తానికి డేటింగ్ యాప్‌లు అవకాశాల ద్వారమా? ప్రమాదాల బాటలా? అన్నది వాటిని ఉపయోగించే మన చేతుల్లోనే ఉంది.
పరిచయం పెంచుకోవడం తప్పు కాదు… కానీ జాగ్రత్త లేకపోవడం ప్రమాదం.
“ఒక క్లిక్ పరిచయం… జీవితాంతం సమస్యగా మారకూడదు” అన్నదే ఈ ఘటనలు మనకు చెబుతున్న నిజం.
