గంజాయి లారీని వదిలేసి డ్రైవర్ పరార్
గంజాయి లారీని వదిలేసి డ్రైవర్ పరార్
- రోడ్డుపై ఉన్న ఈ లారీని బైక్‌తో ఢీకొని యువకుడు మృతి
- తమిళనాడు పోలీసుల ట్రాకింగ్ అప్రమత్తమైన డ్రైవర్
- ఒంగోలు సమీపంలో గంజాయి లారీ గుర్తింపు
- తాలూకా పోలీసుల అదుపులో తమిళనాడు లారీ
ఒంగోలు క్రైం, జూన్ 3(ఆంధ్రప్రభ): ఆంధ్ర నుండి తమిళనాడుకు భారీ మొత్తంలో గంజాయిని ఏ మాత్రం అనుమానం రాకుండా స్మగ్లర్లు ఒక పాత లారీలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలు దాటించేశారు. అర్ధరాత్రి దాటింది గమ్యాన్ని చేరుకోవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. తెల్లవారితే తమిళనాడు బార్డర్ దాదాపుగా చేరినట్టే. తమిళనాడు పోలీసులు పక్క సమాచారంతో అడుగులు వేశారు. స్మగ్లర్సులో ఒకడిని అదుపులోకి తీసుకొని గంజాయి లారీ జాడను కనుక్కున్నారు. లారీని ట్రాక్ చేస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. అత్యంత గోప్యంగా జరుగుతున్న తమిళనాడు పోలీసుల ఆపరేషన్ స్మగ్లర్కు ఉప్పందింది. వెంటనే లారీ డ్రైవర్ను అప్రమత్తం చేశారు. వెంటనే లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్… ఆగి ఉన్న గంజాయి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఢీకొని అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు లారీని తనిఖీ చేసి అవాక్కయ్యారు. లారీ నిండా గంజాయి పొట్లాలు దర్శనమిచ్చాయి. వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన ఒక గ్యాంగ్ వైజాగ్ నుండి తమిళనాడుకు భారీ మొత్తంలో గంజాయిని రవాణా చేస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు సదురు గ్యాంగ్ లోని ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్నటువంటి వాహనాన్ని ట్రాక్ చేసే పనిలో పడ్డారు. డ్రైవర్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా గంజాయి కలిగిన వాహనాన్ని ట్రాక్ చేసుకుంటూ తమిళనాడు పోలీసులు బయలుదేరారు. పోలీసులకు విషయం తెలిసిందని గ్రహించిన స్మగ్లర్ల బృందం డ్రైవర్ ను వెంటనే అప్రమత్తం చేశారు. విషయం తెలిసే సమయానికి లారీ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ హైవే పై పరుగులు పెడుతుంది . వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ టచ్ చేసాడు. హుటాహుటిన అక్కడే లారీని వదిలేసి పరారయ్యాడు.

బైక్‌తో లారీని ఢీ.. యువకుడు మృతి
మంగళవారం అర్ధరాత్రి తెల్లవారితే బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ వెనక నుండి లారీని ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోనగర్లో ఆటో మెకానిక్గా పనిచేస్తున్న ఒంగోలు ఆరవ కాలనీకి చెందిన కొడియన్ లోకేష్ (20) అనే యువకుడు ఆగిన ఉన్న లారీని వెనక నుండి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన హైవే పోలీసులు ఉన్న తదితరులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఒంగోలు జి జి హెచ్ కు తరలించారు. వాహనం మరమ్మత్తుల కోసం రోడ్డు మధ్యలో నిలిచిపోయిందని తొలిత భావించిన పోలీసులు డ్రైవర్ కనిపించకపోవడంతో వాహనాన్ని తనిఖీ చేశారు. గంజాయి జాడలు కనిపించడంతో పై అధికారులకు విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న ఒంగోలు సబ్ డివిజన్ డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీని స్వాధీనం చేసుకొని తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీలో సుమారు 500 కిలోలకు పైబడి గంజాయి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రోడ్డు ప్రమాదం ఘటనపై కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు.
