పంటలకు కాపలాగా బీరుసీసా గంటలు

పంటలకు కాపలాగా బీరుసీసా గంటలు
- గాలి ఉంటే చాలు…
- శబ్దంతో పారిపోతున్న పక్షులు
టేకుమట్ల, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామ రైతులు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పక్షులను అదిలించడానికి మనుషులు కావాలి, కానీ ఇక్కడ గాలి ఉంటే చాలు.. ఆ గంటలే కాపలా కాస్తాయి. అదెలా అంటే… ఖాలీ బీరుసీసాలతో పొలాల్లో గంటల్లా వేలాడదీస్తారు. బీరుసీసా మూతికి ఒక పెద్ద ఇనుప మేకును జతచేసి దానిని పొలం చుట్టూ గట్లపై ఉన్న చెట్లకు వేళాడగడతారు. ఈ మేకుకు తేలికపాటి అట్టముక్కను కడతారు.
గాలికి ఈ అట్టముక్క అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. అదేసమయంలో బీరుసీసాకు కట్టిన మేకు కదిలి సీసాకు తగలడంతో శబ్దం వస్తుంది. ఈ శబ్దానికి పొలాల్లో పంటను తినేస్తున్న చిలుకలు, కోతులు ఇతర పక్షులు పారిపోతున్నాయి. ఒకవైపు కోతుల బెడద, మరోవైపు పశువుల సంచారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ చిలుకల బెడద పెద్ద సమస్యగా మారింది.
ఖరీదైన నెట్స్, పురుగుమందుల కంటే, కేవలం పాత సీసాలు, బోల్టులతో తయారుచేసిన ఈ ‘డెసిబెల్’ పరికరం అద్భుతంగా పనిచేస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టేకుమట్ల మండలం పరిసరాల్లో సుమారు 20కి పైగా ఇలాంటి గంటలు ఇప్పుడు పంటలకు కాపలాగా నిలుస్తున్నాయి. రైతుల ఐడియా అదిరింది అంటూ ప్రశంసిస్తున్నారు..
