కల్యాణ బ్రహ్మోత్సవాలు…
కల్యాణ బ్రహ్మోత్సవాలు…
మంగళస్నానాలతో ఉత్సవాలు ప్రారంభం
మార్చి 31న దివ్య కల్యాణం..
వాహన సేవలు, నదీ విహారంతో ఆధ్యాత్మిక వైభవం..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి (మార్చి 29, ఆదివారం) చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 8 గంటలకు స్వామివార్లకు మంగళస్నానాలు నిర్వహించి, వధూవరులుగా అలంకరించుటతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చైత్ర శుద్ధ ఏకాదశి నుండి తదియ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించబడనున్నాయి.
వైభవంగా చైత్రమాస బ్రహ్మోత్సవాలు..

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 29న ఉదయం 8 గంటలకు మంగళస్నానాలు, సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణంతో అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. మార్చి 31న దివ్య కల్యాణం మార్చి 31 (మంగళవారం) రాత్రి 10:30 గంటలకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. దీనికి ముందు రాత్రి 7 గంటలకు రాయబారము (ఎదుర్కోలు ఉత్సవం) నిర్వహిస్తారు.
వాహన సేవల వైభవం..
చైత్రమాస బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు వివిధ వాహన సేవలు నిర్వహించబడతాయి. మార్చి 29న వెండి పల్లకీ, మార్చి 30న రావణ వాహనం, మార్చి 31న నంది వాహనం, ఏప్రిల్ 1న సింహ వాహనం, ఏప్రిల్ 2న వెండి రథోత్సవం భక్తులను అలరించనున్నాయి.
నదీ విహారం ప్రత్యేక ఆకర్షణ..
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేకంగా నిర్వహించే చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 3న సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో స్వామివార్ల తెప్పోత్సవం (నదీ విహారం) నిర్వహించబడుతుంది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
