పోలీసులపై దాడి.. ముగ్గురికి రిమాండ్

పోలీసులపై దాడి.. ముగ్గురికి రిమాండ్
విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు
కేసముద్రం, మే 23 (ఆంధ్రప్రభ):
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు చేసి, అందులో ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన ఘటన కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం ఏఎస్ఐ ఆర్. సదయ్య పై అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో పెనుగొండ క్రాస్ వద్ద మద్యం సేవించి ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులు ఏఎస్ఐపై దాడికి పాల్పడ్డారు.
దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ ఏఎస్ఐ సదయ్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
ఈ ఘటనలో మర్రితండా శివారు చెరువు ముందుతండాకు చెందిన ధరావత్ గణేష్, గుర్రాలగుట్ట తండా శివారు ఉత్తరతండాకు చెందిన గుగులోతు రాకేష్, ధారావత్ యాకుబ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
మరో నిందితుడు ధరావత్ వినోద్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సై క్రాంతి కిరణ్ వెల్లడించారు.
