వడ్లు కొంటేనే ఇంటికి వెల్తాం..!

వడ్లు కొంటేనే ఇంటికి వెల్తాం..!
- లారీల కోసం రైతుల రాస్తారోకో
- గంటపాటు స్థంభించిన గజ్వేల్–రామాయంపేట రహదారి
రాయపోల్, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు ఇప్పుడు లారీల కొరత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వడ్లు పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు పంపించి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం లింగారెడ్డిపల్లి చౌరస్తా వద్ద రైతులు భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గజ్వేల్–రామాయంపేట ప్రధాన రహదారిపై రైతులు సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.
దీంతో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. రోడ్డుపైనే కూర్చొని “వడ్లు కొనాలి.. రైతును ఆదుకోవాలి” అంటూ రైతులు నినాదాలు చేశారు. ఆందోళనకు చిన్నమాసంపల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి మద్దతు తెలుపుతూ రైతుల పక్షాన నిలిచారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కొనుగోలు ప్రక్రియలో జాప్యం కొనసాగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఏపీఎం యాదగిరి, రాయపోల్ ఎస్సై మానస సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. లారీలు పంపించి కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
