సామాన్య భక్తుడే సుప్రీం…

సామాన్య భక్తుడే సుప్రీం…
ఇంద్రకీలాద్రిపై సేవల్లో మార్పు రావాలి
దేవాదయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్
భక్తులకు ప్రాధాన్యతపై స్పష్టమైన దిశానిర్దేశం..
లిఫ్టులు, ఏసీ బస్సులు, మౌలిక వసతులపై కీలక నిర్ణయాలు
వారం రోజుల్లో మార్పు లేకపోతే చర్యలు
ఆంధ్రప్రభ, ద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో గౌరవంగా వ్యవహరించాలని, ఇంటికి వచ్చిన బంధువుల్లా చూసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు.

ఆలయ పరిసరాల్లో పూర్తిస్థాయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పాలని, తిరుమల తరహాలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం వన్‌టౌన్ శనేశ్వరస్వామి ఆలయం సమీపం నుంచి కొండపైకి ఏసీ బస్సులు ఏర్పాటు చేయాలని, మహామండపం నుంచి శివాలయం మార్గంలో నాలుగు లిఫ్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూ లైన్లలో త్రాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.
ఆన్‌లైన్ సేవలు పెంచడం, ఐవిఆర్‌ఎస్ సర్వే ద్వారా ఫీడ్‌బ్యాక్ సేకరించడం, సైన్‌బోర్డులు స్పష్టంగా ఏర్పాటు చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. దేవస్థానంలో అనవసర ఖర్చులు తగ్గిస్తూ, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై వస్తున్న ఫిర్యాదులను గమనించి, వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని హెచ్చరించారు.

ఆర్ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ల ద్వారా భద్రతా సిబ్బంది హాజరు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వారం రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని, లేకపోతే చర్యలు తప్పవని కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. సమావేశంలో దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
