Andhra Pradesh Tourism | ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు

Andhra Pradesh Tourism | ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు

Andhra Pradesh Tourism | అరకు, పులికాట్ ట్రైల్స్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు
హోం స్టేలు, వినోదాలతో పర్యాటకులకు కొత్త అనుభూతి
ప్రసాద్, స్వదేశీ దర్శన్ పథకాలతో టూరిజానికి ఊతం

Andhra Pradesh Tourism | అమరావతి, ఆంధ్రప్రభ : పర్యాటకులకు సరికొత్త అనుభూతులను పంచేందుకు ఏపీ టూరిజం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పర్యాటక స్వర్గధామంగా ఉన్న అరకు, పులికాట్ ట్రైల్స్ (ట్రెక్కింగ్, రూట్‌ని దారిలో నడక) అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. వీటికోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడంతో డీపీఆర్ సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అనుమతులు రాగానే పనులు చేపట్టే అవకాశం ఉంది. ఈ ట్రైల్స్‌లో విహరించే పర్యాటకులకు మరపురాని అనుభూతులను మిగిల్చే విధంగా అధికారులు వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్య మధ్యలో విడిది చేసేందుకు హోం స్టేలు, వినోదాలు, ఇతర ఎమినిటీస్ ఏర్పాటు చేసే యోచనలో ఏపీటీడీసీ చర్యలు చేపడుతోంది.

అందాల అరకు.. కనువిందు చేసే పులికాట్

అందాల అరకుకు ఎక్కువమంది పర్యాటకులను చేరువ చేసే ఉద్దేశంతో ఏపీటీడీసీ చర్యలు చేపట్టింది. దేశ, విదేశాల నుంచి నిత్యం వందలాది మంది ఈ ప్రాంతాన్ని సందర్శించి మైమరిచిపోతారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, అరకు కాఫీ రుచులు ఇలా ప్రతి అంశం పది కాలాలు గుర్తిండిపోయే జ్ఞాపకాలుగా వారి మదిలో నిలిచిపోతుంది. అయితే ఇప్పటికే అరకు కొండల్లో ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు ఏర్పాటుచేసిన ట్రైల్స్‌కు యువత నుంచి విశేష స్పందన వస్తోంది.

కొండ గట్టులు ఎక్కుతూ అక్కడి పచ్చదనాన్ని చూస్తూ మనోఉల్లాసంతో గడుపుతున్నారు. ఈ ట్రైల్స్ మరింత థ్రిల్స్ పెంచే ఉద్దేశంతో పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. మార్గమధ్యలో వినోద ఏర్పాట్లు చేస్తోంది. అలాగే రాత్రివేళ ఉండే వీలుగా హోం స్టేలు అభివృద్ధి చేయడంతో పాటు అనేక వినోద, సాంస్కృతిక అంశాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. ఎమినిటీస్ అభివృద్ధి చేసి సరికొత్త అనుభూతులు పొందేలా రూపకల్పన చేసింది. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటుచేసేందుకు అవసరమైన డీపీఆర్‌ను ఏపీటీడీసీ సిద్ధం చేస్తోంది.

వసతికి హోం స్టేలు

పులికాట్లో విదేశీ పక్షుల అందాలను దగ్గరగా వీక్షించే అవకాశం

ప్రసాద్ పథకం కింద మంగళగిరి, వేదగిరి ఆలయాల అభివృద్ధి

స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో అమరావతిలో మైస్ సెంటర్ ఏర్పాటు

విదేశీ పక్షుల విడిది.. పులికాట్లోనూ ట్రైల్స్ అభివృద్ధి

నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు పర్యాటకుల మదిని దోచేస్తోంది. ఈ సరస్సు వద్ద విడిది కోసం వచ్చే దేశ, విదేశాల నుంచి పక్షుల అందాలను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది ఈ ప్రాంతానికి తరలివస్తారు. పొడవాటి ముక్కులతో, శ్వేతవర్ణంతో కళ్లను కట్టిపడేసేలా ఉన్న ఆ విహంగాల అందాలను కనులారా తిలకించి మనస్సు పులకించిపోతుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ సరస్సు మధ్యలో ఓ నడకదారి ఏర్పాటుచేశారు. పులికాట్ ట్రైల్స్ పేరుతో ఏర్పాటుచేసిన ఈ దారిలో సందర్శకులు నడుచుకుంటూ వెళ్తూ పక్షులను మరింత దగ్గరగా చూసి మురిసిపోయే అనుభూతులను పర్యాటక శాఖ కల్పించింది.

ట్రైల్స్ అభివృద్ధితో పర్యాటకాభివృద్ధి

శేషగిరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీటీడీసీ

అరకు, పులికాట్ ప్రాంతాల్లో ట్రైల్స్ అభివృద్ధి చేస్తే పర్యాటకంగా ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే వీటికోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఈ నెలాఖరులోగా వీటికి సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికి పంపుతాం. అక్కడ నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించి పర్యాటకులకు మంచి అనుభూతులు కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తాం.

• అరకు, పులికాట్లో ట్రెక్కింగ్‌కు ప్రపోజల్స్
• కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు

మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించడంతో రూ.100 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసేందుకు సిద్ధమైంది. ఇక్కడ కూడా వినోదం అందించే ఏర్పాట్లు, హోం స్టేలు కూడా ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. నెలరోజుల్లోనే వీటిని కేంద్రానికి పంపి అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు కూడా రంగం సిద్ధమైంది.

మంగళగిరి పానకాలస్వామి ఆలయానికి మహర్దశ

కేంద్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజం పేరుతో ఆలయాలను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రసాద్ స్కీమ్ కింద పలు ఆలయాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే టూరిజం శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. మంగళగిరిలోని ప్రఖ్యాతి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (పానకాల స్వామి)లో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను జూలై 10వ తేదీలోగా రాష్ట్రం కేంద్రానికి పంపనుంది. అదేవిధంగా వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో కూడా ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించనుంది.

మైస్ సెంటర్లకు ప్రతిపాదనలు

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ స్కీమ్ భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మచిలీపట్నం, గన్నవరం లేదా అమరావతిలో ఏదైనా ఒక ప్రాంతంలో మైస్ సెంటర్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు రూపొందించింది. ఒకొక్క ప్రాజెక్టుకు రూ.100 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి భారీ సమూహాలు ఒకేసారి సమావేశాలు నిర్వహించుకునేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. అదేవిధంగా ఎమ్యూజ్‌మెంట్ పరికరాలతో సందర్శకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏపీటీడీసీ సిద్ధం చేసింది.