తోటి వారికి సహాయం చేసుకుంటూ జీవనాన్ని సాగించాలి…

తోటి వారికి సహాయం చేసుకుంటూ జీవనాన్ని సాగించాలి…
ముస్లిం పెద్దలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
పటమట, ఆంధ్రప్రభ : పవిత్రమైన ఖురాన్‌లో పేర్కొన్నట్లుగా తోటి వారికి సహాయం చేసుకుంటూ జీవనాన్ని ముందుకు సాగించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ధనేకుల కళ్యాణ మండపం సమీపంలో శనివారం నాడు ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఈద్గా స్థలం కేటాయింపు గురించి గతంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చామని చెప్పారు. విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గంలోని ముస్లింలు నమాజు చేసుకునేందుకు స్థలం కేటాయిస్తూ ప్రభుత్వ జీవో మంజూరు చేసిందని తెలిపారు. ఈ స్థలం చుట్టూ గోడ నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహాకరిస్తోందన్నారు. చిన్న పాటి బేధాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలన్నారు. చక్కటి ప్రదేశంలో ముస్లింలు ప్రార్థలను నిర్వహించుకోడానికి అనువైన స్థలాన్ని తమ ప్రభుత్వం ముస్లిం లకు కేటాయించిందన్నారు.

పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని అందించినందుకు ఆ అల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముస్లింలు ప్రార్థనలు చేస్తారన్నారు. పవిత్రమైన ఖురాన్‌లో పేర్కొన్నట్లుగా అందరూ కలిసిమెలిసి జీవిస్తూ తోటి వారికి సహాయం చేస్తూ సామరస్య పూర్వక జీవనాన్ని అలవరచుకోవాలని చెప్పారు. రంజాన్ సందర్బంగా చేసే ఉపవాస దీక్షలో అనేక మంచి అంశాలు ఉన్నాయని, ఉపవాస దీక్ష వల్ల శరీరం ఆరోగ్యంగా తయారై మంచి ఆలోచలు వచ్చి ఉత్తమ సమాజం నిర్మాణానికి దోహదం చేస్తోందన్నారు.

పవిత్రమైన ఖురాన్‌లో పేర్కొన్న అంశాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ తోటి వారికి సహాయం చేసుకుంటూ జీవనాన్ని ముందుకు సాగించాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ముస్లిం నాయకులు మాట్లాడుతూ ముస్లింలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో మాట్లాడి స్థలాన్ని కేటాయించేలా చేయడంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కృషి చేశారని అన్నారు. ఈ ప్రార్థనల్లో ముస్లిం పెద్దలతో పాటుగా అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
