పట్టణాభివృద్ధికే ప్రధమ ప్రాధాన్యత

పట్టణాభివృద్ధికే ప్రధమ ప్రాధాన్యత

రూ.34 వేల కోట్ల తో పటిష్ట ప్రణాళిక
కేంద్ర నిధులు, రాష్ట్ర వాటా, బ్యాంకు రుణాలతో..
భారీ మౌలిక వసతుల కల్పన చేస్తాం
మున్సిపాలిటీల ఆదాయ వనరుల పెంపునకు పి పి పీ మోడల్
పీ పీ పీ విధానానికి ప్రాధాన్యం ఇవ్వండి..
అవగాహన లేక ఆరోపణలు…
నీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.
మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పట్టణ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేదిగా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ కార్యాచరణను వివరించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాష్ట్రానికి లభించే నిధులు, రాష్ట్ర వాటా సమీకరణ, బ్యాంకు రుణాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానం ద్వారా పట్టణాభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రూ.3,600 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు మున్సిపల్ సంస్థలు మరో రూ.10,800 కోట్లను సమీకరించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో మొత్తం రూ.14,400 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రూ.12,394 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో రూ.5,400 కోట్లతో మురుగునీటి శుద్ధి (ఎస్‌టీపీ) ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు.

మొత్తంగా రూ.20 వేల కోట్లకు పైగా విలువైన అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు ఇప్పటికే భూమిపైకి వచ్చాయని పేర్కొన్నారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట్ర వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి అంశాలపై మున్సిపల్ కమిషనర్లకు వర్క్‌షాప్‌లో మార్గనిర్దేశం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి సుమారు రూ.2,200 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, మిగిలిన ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఆదాయ వనరులను పెంచేందుకు పీ పీ పీ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

మున్సిపాలిటీలకు చెందిన ఖాళీ స్థలాలు, ఆస్తులపై కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి వాటి ద్వారా ఆదాయం పొందేలా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శక టెండర్ విధానంలోనే జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో భారీ భవనాల నిర్మాణానికి మున్సిపల్ నిధులు వినియోగించడంతో ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలపై ప్రభావం పడిందని విమర్శించారు.

అదే పనులను పీ పీ పీ విధానంలో చేపట్టి ఉంటే మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చేదని, ఆ నిధులను రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాల వంటి ప్రజా అవసరాలకు వినియోగించే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకే ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి కాలనీలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పీ పీ పీ విధానంపై జరుగుతున్న విమర్శలు వాస్తవాలకు విరుద్ధమని, మున్సిపాలిటీల ఆర్థిక స్వావలంబనకు ఇది కీలక సాధనమని పేర్కొన్నారు.

Leave a Reply