పీడీ యాక్ట్ అమలు పరచాలని ఉత్తర్వులు జారీ..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; నేరాన్నే ప్రవృత్తిగా కలిగి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కేటీఎం పండుపై జిల్లా ఎస్పీ వి.విద్యా సాగర్ నాయుడు నివేదిక ఆధారితంగా తక్షణమే పిడి యాక్ట్ అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమాజంలో ప్రతి వ్యక్తి శాంతిభద్రతల పరిరక్షణలో భాగమవ్వాలి గాని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రాణహాని కలిగేలా వ్యవహరిస్తే అలాంటివారు ఎంతటి వారైనా సరే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని నిరూపించారు కృష్ణా జిల్లా పోలీసులు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు గతంలో అతనిపై ఉన్న నేరచరిత్రను ఆధారంగా తీసుకొని నివేదికను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీ ద్వారా అందజేయడం జరిగింది.

అందులో భాగంగా శుక్రవారం కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అలవాటు పడిన గ్యాంగ్ వార్లను ప్రేరేపిస్తున్న నేరస్తుడిపై పోలీసు వారి విజ్ఞప్తి మేరకు పీడీ ఏసీటీ (ప్రివెంటివ్ డిటెన్షన్) సంబంధిత ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం జారీ అవ్వడం జరిగింది. వివరాల్లోనికి వెళితే కొండూరి మణికంఠ కేటీఎం పండు కృష్ణా జిల్లాకు చెందిన ఈ వ్యక్తి వ్యక్తులపై విచక్షణ రహితంగా హత్యాయతానికి పాల్పడుతూ, హత్య, ఇతర రకాల నేరాలకు పాల్పడడం గ్యాంగ్ వార్లను ప్రేరేపించడం వంటి నేరాలకు అలవాటు పడి సాధారణ ప్రజాజీవనానికి సైతం అంతరాయం కలిగిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నాడు. కేవలం నేరాలు మాత్రమే చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.

ఇతనిపై 2020 వ సంవత్సరంలో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇతనిపై 2023వ సంవత్సరంలో 4 కేసులు 2024వ సంవత్సరంలో ఉన్న 1 కేసును ప్రామాణికంగా తీసుకొని అతడి పూర్తి నేరాలకు సంబంధించిన నివేదికను , అంతేకాక ప్రస్తుత కాలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తన నేరాలకు పాల్పడుతూ పోలీసు వారికి సవాలు విసురుతున్నాడు. అందుకుగాను 2024వ సంవత్సరంలో అతనిపై పిడి యాక్ట్ అమలుపరచడం జరిగింది. అయినప్పటికీ తన ప్రవర్తనలో మార్పు రాకపోగా మరల 3 నేరాల్లో పాల్గొన్నందుకు అతని నేరాలను అదుపు చేయడానికి గాను మరొకసారి జిల్లా ఎస్పీ గారు అతనిపై పీడీ ఏసీటీ ను ప్రయోగించేందుకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

అతనిపై ఇప్పటి వరకు మొత్తం 18 కేసులు అనగా హత్య నేరాలు, బెదిరింపులకు పాల్పడడం, గంజాయి విక్రయాలు ఇతరత్రా నేరాలకు సంబంధించి నమోదు అయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న మరొక 15 మందిని జిల్లాలో గుర్తించామని, రెండు లేదా అంతకన్నా ఎక్కువ నేరాలలో పాల్గొన్న వారిని ఎంపిక చేసి, వారిలో ఎవరైతే తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారో వారిపై పిడి యాక్ట్ ప్రయోగించేందుకు అన్ని రకాల ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply