ఏపీఎల్-5కు గ్రాండ్ స్టార్ట్..

ఏపీఎల్-5కు గ్రాండ్ స్టార్ట్..

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సింహాద్రి వైజాగ్ లయన్స్
కాకినాడ కింగ్స్‌తో తొలి పోరుకు సిద్ధమైన హోమ్ జట్టు
విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాదం నేపథ్యంలో కల్చరల్ కార్యక్రమాల రద్దు
నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన ఆటగాళ్లు, అధికారులు

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 నేడు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్, కాకినాడ కింగ్స్‌తో తలపడుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేశారు. టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో కాకినాడ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న రెండు జట్లు కావడంతో తొలి మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది.

నల్ల బ్యాడ్జీలతో సంఘీభావం…

ఇదిలా ఉండగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో ముందుగా ప్రణాళిక చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రద్దు చేసింది. ప్రమాద బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతినిధులు నల్ల బ్యాండ్లతో మైదానంలోకి ప్రవేశించారు. ఏపీఎల్ సీజన్-5కు తొలి రోజే భావోద్వేగ వాతావరణం నెలకొనగా, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.

Leave a Reply