4 months | ‘రాఘవేంద్ర’లో 4 నెలల బాబు మృతి

4 months | ‘రాఘవేంద్ర’లో 4 నెలల బాబు మృతి
- డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని బంధువుల ఆందోళన
4 months | మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర ఆసుపత్రి(Raghavendra Hospital)లో బుధవారం రాత్రి నాలుగు నెలల బాలుడు మృతి(4 months old boy died) చెందాడు. బాలుడి మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆగ్రహం చెందారు. ఈ ఘటన బుధవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
జిల్లాలోని కాసీపేట మండలం యాప గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు బాబు అనారోగ్యంతో ఉండడంతో మంచిర్యాలలోని రాఘవేంద్ర ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాలున్ని పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తూ ఉండగా.. ఆస్పత్రి సిబ్బంది ముక్కులో పైపు వేసే సందర్భంలో బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడని తెలుస్తోంది.
బాబు చనిపోయినట్లు వైద్యులు(doctors) చెప్పగానే కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. వైద్యులు మాత్రం తాము సరైన చికిత్స అందించామని చెబుతున్నప్పటికీ బంధువులు మాత్రం ఆందోళనకు దిగారు. రాత్రి టౌన్ సీఐ ప్రమోద్ రావు(CI Pramod Rao) ఆసుపత్రికి చేరుకున్నారు.
అటు బాధితులతో పాటు ఇటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. కాగా అరగంట సేపు ఆందోళనకు దిగిన అనంతరం పోలీసుల జోక్యంతో ఎట్టకేలకు పరిస్థితి సద్దుమణిగింది. ఈ రోజు ఉదయం సైతం బాబు కుటుంబ సభ్యులు, బంధువులు కొంత సేపు ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా ఇరువార్గాల మధ్య కొంత రాజీ కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం.

