యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: దూరు రవికిరణ్
మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం గ్రామానికి చెందిన దూరు రవికిరణ్ ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (స్టేట్ జనరల్ సెక్రటరీ)గా ఎన్నికయ్యారు.
ఇటీవల ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంస్థాగత ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి ఈ పదవికి ఎన్నికైనట్లు యూత్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో 15 మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన దూరు రవికిరణ్‌కు యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను అధికారికంగా అభినందనలు తెలిపారు.
దూరు రవికిరణ్ గతంలో మైలవరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దూరు రవికిరణ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన రాజకీయ ప్రస్థానంలో సహకారం అందించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి బొర్రా కిరణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు యువత సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని దూరు రవికిరణ్ పేర్కొన్నారు.
