రెవెన్యూ శాఖలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తాం..

2వ డివిజన్‌లో రెవెన్యూ, కార్పోరేషన్‌ అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

పటమట, ఆంధ్రప్రభ : రెవెన్యూ శాఖలోని ప్రతి సమస్యకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గజానికి రికార్డు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా అదేశాలు జారీ చేశారని తెలిపారు. శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్‌ మాచవరం డౌన్‌ వాణి స్కూల్‌ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. తూర్పు నియోజకవర్గంలోని రెవెన్యూ శాఖలోని సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్‌ సహకారంతో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని మాచవరం జాగీరులో సుమారు 143 ఎకరాల్లో 5 వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, 1980వ సంవత్సరం వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెప్పారు.

2013వ సంవత్సరం వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఆ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్‌ల్లో వచ్చిన నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని వివరించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడానికి ఉన్న కారణాలను పరిశీలించడానికి రెవెన్యూ అధికారులు వచ్చారన్నారు. ఈ ప్రాంతంలోని వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ పర్యటనలు చేస్తున్నామని చెప్పారు. తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ అంశాన్ని కలెక్టర్‌తో చర్చించి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడి యజమానులకు ఏవిధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసరి గాబ్రియేల్, సుగసాని కృష్ణప్రసాద్, తాడి బాబూరావు, ముత్యాల కృష్ణ, అనుములు పూర్ణ, దొమకొండ రవి, షేక్‌ షకీలా బేగం, నాగుల్‌ మీరా, తహసీల్దారు రోహిణీదేవివ, సర్వే విభాగం ఎ.డి. వై.మోహనరావు, మండల సర్వేయర్‌ లక్ష్మీదుర్గ, కార్పొరేషన్‌ అధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.