మెగా డీఎస్సీపై వైసీపీ విషప్రచారం..

మెగా డీఎస్సీపై వైసీపీ విషప్రచారం..

ఫేక్ ట్వీట్లతో దుష్ప్రచారం: దేవినేని ఉమ

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తుంటే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న మంచి పేరును అడ్డుకునేందుకు ఫేక్ సోషల్ మీడియా ప్రచారాలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.

గొల్లపూడిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన దేవినేని ఉమ, “నా తెలుగుదేశం – నా బాధ్యత” నినాదంతో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీగా సిద్ధమవుతున్నాయని తెలిపారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు మహానాడును విజయవంతం చేయడానికి ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే మూడు సంవత్సరాలకు దిశానిర్దేశం చేసే వేదికగా మహానాడు నిలుస్తుందని పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ 2025ను పారదర్శకంగా నిర్వహిస్తున్నప్పటికీ వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని వైసీపీ, ఇప్పుడు ఉపాధ్యాయులను అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఉపాధ్యాయ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, పెట్టుబడుల ప్రవాహాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. కేవలం 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 22 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

వైసీపీ పాలనలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని దేవినేని ఉమ విమర్శించారు. పీఏ చిన్నప్పన్న అరెస్టుతో అనేక దందాల వ్యవహారం బయటపడుతోందని, వందల కోట్ల అక్రమాలపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. గతంలో జరిగిన అక్రమాలు త్వరలో మరింతగా వెలుగులోకి వస్తాయని ఆయన హెచ్చరించారు.

Leave a Reply