3-burnt-alive : క్షణాల్లో .. సజీవదహనం Andhra Prabha Sad News
3-burnt-alive : క్షణాల్లో .. సజీవదహనం Andhra Prabha Sad News
- కళ్ల ఎదుటే ముగ్గురు బుగ్గి
- ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఘోరం
- అదుపు తప్పిన లారీ
- డివైడర్ దాటి .. అవతల లారీతో ఢీ
- మంటలు చెలరేగి..
- రెండులారీల్లో ముగ్గురు దుర్మరణం
( ఆంధ్రప్రభ, పత్తిపాడు / పల్నాడు బ్యూరో )

3-burnt-alive : గుంటూరు- పల్నాడు సరిహద్దు ప్రాంతమైన బోయపాలెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఈ దుర్ఘటన జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై చోటుచేసుకుంది. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ అవతలకు వెళ్లి గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు ఎదురుగా వస్తున్న లారీ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే రెండు లారీలకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. ఒక లారీలో నాపరాయి, మరో లారీలో పేపర్ లోడ్ ఉండటంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఢీకొన్న ప్రభావంతో లారీల క్యాబిన్లు దెబ్బతిని మూసుకుపోవడంతో లోపల ఉన్న డ్రైవర్లు, క్లీనర్ బయటకు రాలేకపోయారు. దీంతో ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు సమాచారం.

అదే మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.
లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
