కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన.. తప్పిన పెను ప్రమాదం
పెనమలూరు, ఆంధ్రప్రభ: పెనమలూరులో బ్రిటిష్ కాలం నాటి బందరు కాలువపై ఉన్న పాత వంతెన బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వంతెన పురాతనమైనది కావడంతో ఇప్పటికే కేవలం ద్విచక్ర వాహనాలు, పాదచారుల రాకపోకలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం, ప్రాణనష్టం తప్పింది.
వంతెన కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తుండగా, భద్రతా చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు.
