ఏపీలో భారీ హోటల్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్..
ఏపీలో భారీ హోటల్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్..
అమరావతి, ఆంధ్రప్రభ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక, వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు అమరావతిలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చాయి. అదేవిధంగా పలు ప్రముఖ హోటల్స్ సైతం నవ్యాంధ్రలో తమ హోటల్స్ నిర్మాణానికి సిద్ధమయ్యాయి.
ప్రభుత్వం కూడా పర్యాటక పాలసీలో భాగంగా పలు సంస్థలకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా అమరావతిలో రూ.210.14 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న 5 స్టార్ ట్విన్ హోటల్ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేసింది.
ఇండాయల్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క్రౌన్ ప్లాజా, హాలిడే ఇన్ బ్రాండ్ల కింద ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. సీఆర్డీఏ కేటాయించిన 4 ఎకరాల భూమిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 150 మందికి ఉపాధి లభించనుంది.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం కింద ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది.
తిరుపతిలో రూ.186.84 కోట్లతో 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్
తిరుపతిలో రూ.186.84 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేసింది.
దైవిక్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దైవిక్ హోటల్స్ బ్రాండ్ పేరుతో 1.44 ఎకరాల స్వంత స్థలంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కర్నూలులో మెగా టూరిజం పార్కుకు గ్రీన్ సిగ్నల్
కర్నూలు జిల్లా కల్లూరులో ‘మారియట్’ బ్రాండ్ కింద సమీకృత టూరిజం పార్క్, 5 స్టార్ హోటల్, లగ్జరీ రిసార్ట్, మెగా కన్వెన్షన్ హబ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వెస్సెల్లా హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ రూ.210.14 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. 20 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాయితీలను కూడా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టులో 5 స్టార్ హోటల్, లగ్జరీ రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్, ఒకేసారి 5,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ హబ్ ఏర్పాటు కానుంది.
