22ndaprilsplstory | క్రీడల ద్వారా మహిళల ఎదుగుదల

22ndaprilsplstory | క్రీడల ద్వారా మహిళల ఎదుగుదల
22ndaprilsplstory | పరిపాలనలో మహిళల పాత్ర ప్రభావం
ఆర్థిక అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం
భద్రత, సమానత్వం సవాళ్లు
ప్రాతినిధ్యం ద్వారా మార్పు
రాజకీయాల్లో మహిళల అవసరం
అమలు కావాల్సిన సంకల్పం
22ndaprilsplstory | నా జీవితమంతా నేను పరిగెడుతూనే ఉన్నాను. మొదట కేరళలోని మట్టిదారుల్లో, ఆ తర్వాత అంతర్జాతీయ వేదికపై, ఇప్పుడు ప్రజా జీవితంలో. ప్రతి అడుగులోనూ మహిళలకు ఇక్కడ చోటు లేదని చెప్పే అవరోధాలను ఎదుర్కొన్నాను. వాటిలో కొన్ని కంటికి కనిపించేవి అయితే, బయటకు చెప్పనివి చాలానే ఉన్నాయి. ఈ అడ్డంకులను తొలగించడం మొదలుపెడితే ఏమి జరుగుతుందో కూడా నేను చూశాను. అవకాశం ఫలితాలను మారుస్తుంది. మరీ ముఖ్యంగా మన నమ్మకాన్ని మారుస్తుంది.
నారీశక్తి వందన్ అధినియం (రాజ్యాంగ 128వ సవరణ) బిల్లు–2023ను సాధారణమైన చట్టంగా పరిగణించలేం. ఇది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాత్మక సవరణ. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లను కేటాయించడం అంటే అది వారికిచ్చే బహుమానం కాదు, నామమాత్రంగా చేపట్టే చర్య కూడా కాదు. మరింత ప్రాతినిధ్యం, సమర్థమైన ప్రజాస్వామ్యం దిశగా వేయాల్సిన ఆవశ్యకమైన అడుగు.
ఇప్పటి వరకూ క్రీడలు ఏమి నిరూపించాయి?
1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో నేను పోటీ పడినప్పుడు అతి స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాను. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలమని భావించే భారతీయ క్రీడాకారిణులు అతి కొద్దిమంది మాత్రమే ఉండేవారు. దశాబ్దాల అనంతరం ఆ పరిస్థితి మారింది. శిక్షణ, మౌలిక వసతులు అందుబాటులోకి రావడం, గుర్తింపు పెరగడంతో భారతీయ క్రీడాకారిణులు ప్రపంచ ఖ్యాతిని గడిస్తున్నారు.

పీవీ సింధు, మీరాబాయి చాను, వినేశ్ ఫోగట్, మేరీకోమ్ లాంటి క్రీడాకారిణులు ఒక్కసారిగా వెలుగులోకి రాలేదు. క్రమంగా అవకాశాలను విస్తృతం చేయడం ద్వారా వ్యవస్థ సాధించిన ఫలితమే వీరంతా. ప్రాతినిధ్యం ఆకాంక్షను మేల్కొలుపుతుంది. ఆ ఆకాంక్షకు మద్దతు లభించినప్పుడు విజయం సాధ్యమవుతుంది. ఈ సందేశం స్పష్టంగా ఉంది. మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు వారు దానిని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే కాదు, అద్భుతంగా రాణిస్తారు.
ప్రతి భారతీయునికీ ఉత్తమ పరిపాలన
క్షేత్రస్థాయిలో మహిళల నాయకత్వం చూపిస్తున్న ప్రభావం ఎలా ఉంటుందో భారత్ చూసింది. రాజ్యాంగ 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో చేసిన అధ్యయనాలు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ప్రాథమిక ఆరోగ్య సేవలు మెరుగుపడినట్టు వెల్లడించాయి. ఇవి కేవలం ‘మహిళల సమస్యలు’ మాత్రమే కాదు, జాతీయస్థాయిలో ప్రాధాన్యాలే.
సురక్షితమైన బహిరంగ ప్రదేశాలు, సక్రమంగా పనిచేసే పాఠశాలలు, పోషకాహారం, ఆరోగ్య సేవలు వంటి కుటుంబాలు, సమాజాలను ప్రభావితం చేసే అంశాలపై మహిళలు ఎక్కువ దృష్టి సారిస్తారు. ఈ ప్రాతినిధ్యాన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు తీసుకురావడం అంటే సమానత్వం, పరిపాలనా నాణ్యత పెంపొందించడం.
ప్రాతినిధ్యంలో ఆర్థిక కోణం
భారతదేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం ప్రపంచంలోనే అత్యల్పంగా, సుమారు 25 శాతంగా ఉంది. ఇది కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదు, ఆర్థికపరమైన అవరోధం కూడా. రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగితే ఇప్పటి వరకు వినియోగించని సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. శిశు సంరక్షణ, సురక్షితమైన పని ప్రదేశాలు, రుణ సదుపాయం, మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు వంటి అంశాలకు ప్రాధాన్యం లభిస్తుంది. స్త్రీపురుష సమానత్వాన్ని పెంపొందిస్తే భారత జీడీపీకి 700 బిలియన్ డాలర్ల వరకు అదనంగా జోడించవచ్చని అంచనా. అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం ఉన్న పార్లమెంటును సాధించడం కేవలం ప్రజాస్వామ్యపరమైన అవసరం మాత్రమే కాదు, ఆర్థికపరంగా కూడా కీలకం.

భద్రత, గౌరవం, భాగస్వామ్యం
భద్రత, వివక్ష, అసమాన అవకాశాలు వంటి సమస్యల వల్ల దేశవ్యాప్తంగా ప్రజాసేవలో లక్షలాది మహిళల భాగస్వామ్యం ప్రభావితమవుతోంది. క్రీడలైనా, చదువైనా, కార్యాలయాలైనా ఈ అవరోధాలు లోతుగా పాతుకుపోయాయి.
పార్లమెంటులో మరింత మంది మహిళలకు భాగస్వామ్యం అంటే కేవలం అవగాహనతో మాత్రమే కాకుండా, వాస్తవ అనుభవాల ఆధారంగా చట్టాలు, విధానాలు రూపొందించడమనే అర్థం. చట్టాల అమలులో బలమైన వాదన, సహాయక వ్యవస్థలకు తగిన వనరులు కేటాయించడం ద్వారా న్యాయం అందించవచ్చు. బాధ్యతలు నిర్వర్తించే వారి అనుభవాలు పాలనలో ప్రతిబింబించినప్పుడు అది మరింత ప్రభావవంతంగా మారుతుంది.
ప్రాతినిధ్యం, ఆకాంక్షల శక్తి
భారతదేశంలో అనాదిగా అధికారం మగవాళ్ల చేతుల్లోనే ఉంది. దీనిని మార్చడం కేవలం ఉపరితల మార్పులతో సాధ్యం కాదు. మూలాల్లో నుంచే మార్పు రావాలి. తనలాంటి నేపథ్యం నుంచి వచ్చిన మహిళ చట్టాలను రూపొందించడం చూస్తే అది కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు, అసాధ్యం అన్న నమ్మకాన్ని మార్చే శక్తి. ఆకాంక్ష సామాజిక మార్పుకు ఇంధనం. చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రమాణాలను తగ్గించవు, అవకాశాలను విస్తరిస్తాయి. క్రీడలు, భద్రతా బలగాలు, వైమానిక రంగం, కార్పొరేట్ రంగాల్లో అడ్డంకులను భారతీయ మహిళలు ఇప్పటికే అధిగమించారు. ఇప్పుడు వారి తదుపరి లక్ష్యం శాసన వ్యవస్థల్లో ప్రాతినిధ్యం సాధించడం.
ఇదే సరైన సమయం
నాకు రాజ్యసభ సభ్యురాలిగా పని చేసే అవకాశం లభించింది. అక్కడ వివిధ కోణాల్లో జరిగే చర్చలు నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రత్యక్షంగా చూశాను. అయినప్పటికీ లోక్‌సభలో మహిళా సభ్యుల శాతం కేవలం 15 మాత్రమే. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ. నారీశక్తి వందన్ అధినియం బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు దాన్ని సంపూర్ణంగా, విశ్వసనీయంగా, ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాల్సిన రాజకీయ సంకల్పం అవసరం.
అత్యున్నత నిర్ణయాధికార వ్యవస్థల్లో సగం జనాభాకు తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం సాధ్యం కాదు. సగం ప్రతిభను పక్కన పెట్టి వికసిత్ భారత్ నిర్మాణం అసాధ్యం. సగం గొంతుక మాత్రమే వినిపిస్తే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ముందున్న మార్గం సుస్పష్టం. ఆ మార్గంలో నడిచే సంకల్పం మనకు ఉందా లేదా అన్నదే అసలు ప్రశ్న.
డాక్టర్ పీటీ ఉష
(రచయిత్రి: రాజ్యసభ సభ్యురాలు, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, భారత కామన్వెల్త్ క్రీడల సంఘం అధ్యక్షురాలు)
