బస్సులు బంద్ – సమ్మె ఉద్యమం ఉధృతం

బస్సులు బంద్ – సమ్మె ఉద్యమం ఉధృతం
32 డిమాండ్ల సాధన లక్ష్యంగా ఆర్టీసీ కార్మికుల నిరసన
మంథని బస్టాండ్‌లో శాంతియుతంగా ఆందోళన , పోలీసులు అప్రమత్తం
మంథని, ఆంధ్రప్రభ : తమ న్యాయమైన 32 డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంథని బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికులు బస్సులు బంద్ చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హామీల సాధన లక్ష్యంగా చేపట్టిన ఈ సమ్మె ఉద్యమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ.. టార్గెట్ల పేరుతో యాజమాన్యం వేధిస్తుందని పేర్కొన్నారు. రోజువారి కలెక్షన్లలో మహిళల వాటా ఎంత, పురుషుల వాటా ఎంత అని వివరాలు తీసుకొని పురుషుల కనెక్షన్లు ఎందుకు తగ్గాయని ఆగ్రహం వ్యక్తం చేస్తారని కార్మికులు తెలియజేశారు. కార్మికులు పెండింగ్‌లో ఉన్న 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. తమ హక్కుల సాధన కోసం అవసరమైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బస్టాండ్‌కు చేరుకున్న ఎస్సై – శాంతి భద్రతలపై సూచనలు
ఆర్టీసీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో మంథని ఎస్సై రమేష్ తన సిబ్బందితో కలిసి బస్టాండ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులతో మాట్లాడుతూ.. బస్టాండ్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా గొడవలు జరగకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అదే విధంగా వీధుల్లోకి స్వచ్ఛందంగా వచ్చే ఇతర కార్మికులను అడ్డుకోవద్దని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆందోళన కొనసాగించాలని ఆయన ఆదేశించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
