14peopledied | జకార్తాలో రైళ్ల విలయం: పట్టాలపై చెల్లాచెదురైన ప్రాణాలు..

14peopledied | జకార్తాలో రైళ్ల విలయం: పట్టాలపై చెల్లాచెదురైన ప్రాణాలు..
14peopledied | జకార్తా శివారులో పట్టాలు తప్పిన బోగీలు
మహిళా బోగీపై తీవ్ర ప్రభావం
సహాయక చర్యల తాజా పరిస్థితి
రైలు ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ
14peopledied | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అందరూ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆత్రుతతో ఉన్నారు.. మరికొద్ది నిమిషాల్లో తమ ఇళ్లకు చేరుకుంటామన్న ఆశతో ఉన్న ప్రయాణికులను మృత్యువు రైలు రూపంలో కబళించింది. ఇండోనేషియా రాజధాని జకార్తా శివారులోని బెకాసి ప్రాంతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. రెండు రైళ్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది దుర్మరణం పాలవ్వగా, మరో 84 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగింది? సాధారణంగా నడిచే లోకల్ కమ్యూటర్ రైలు మొదట ఒక టాక్సీని ఢీకొట్టింది. ఆ వేగంలోనే పక్కనే ఉన్న మరో లాంగ్ డిస్టెన్స్ రైలును బలంగా ఢీకొనడంతో అసలు విలయం మొదలైంది. ఒకదానిపైకి ఒకటి ఎగబాకిన బోగీలు, నుజ్జునుజ్జైన ఇనుప కడ్డీల మధ్య ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
మహిళా బోగీలో మిగిలిన విషాదం ఈ ప్రమాదంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తీవ్రంగా దెబ్బతిన్న బోగీల్లో మహిళా కోచ్ ఒకటి. మరణించిన వారిలో, గాయపడిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని అధికారులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోగీలు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోవడంతో, లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం రెస్క్యూ సిబ్బందికి పెను సవాలుగా మారింది. భారీ గ్రైండర్లతో ఇనుప కడ్డీలను కట్ చేసి, అత్యంత కష్టమ్మీద బాధితులను వెలికితీశారు.

ముమ్మరంగా సహాయక చర్యలు ఇండోనేషియా రైల్వే శాఖ సీఈవో బాబీ రసియిదిన్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించారు. “ప్రస్తుతానికి మృతుల సంఖ్య 14గా ఉంది, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం” అని ఆయన ప్రకటించారు. రెస్క్యూ ఏజెన్సీ అధిపతి మొహమ్మద్ స్యాఫి ఆధ్వర్యంలో గాలింపు ప్రక్రియ పూర్తయ్యింది. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోలేదని నిర్ధారించుకున్నాక, రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు చేపట్టారు.
విచారణకు ఆదేశం రైళ్ల రాకపోకలను నియంత్రించే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం ఉందా? లేక లోకల్ రైలు టాక్సీని ఢీకొన్న పరిణామమే ఈ స్థాయి విధ్వంసానికి కారణమా? అనే కోణంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
