Tdp-Ycp-Clash : అక్రమ ఇసుక చిచ్చు.Andhra Prabha Crime News
Tdp-Ycp-Clash : అక్రమ ఇసుక చిచ్చు.Andhra Prabha Crime News
- నేమకల్లు–సంగాలలో ఉద్రిక్తత
- టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీ .
- రాళ్లదాడులు..వాహనం ధ్వంసం
- ఎమ్మెల్యే సోదరుడికి గాయాలు..
- తెలగు తమ్ముడి వాహనం ధ్వంసం

( ఆంధ్రప్రభ. ,చిప్పగిరి/ కర్నూల్ రూరల్ బ్యూరో)
Tdp-Ycp-Clash : చిప్పగిరి మండలం, నేమకల్లు సంగాల జంట గ్రామాల్లో అక్రమ ఇసుక వివాదం రాజకీయ రంగు పులుముకుని తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిన్నపాటి వాగ్వాదంగా ప్రారంభమైన వివాదం, కొద్ది గంటల్లోనే టీడీపీ–వైసీపీ శ్రేణుల మధ్య రాళ్లదాడుల వరకు వెళ్లింది. శనివారం రాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గ్రామాల్లో భయాందోళన వాతావరణం ఏర్పడింది.
స్థానికుల కథనం ప్రకారం, నేమకల్లులో అక్రమంగా ఇసుక నిల్వ చేసిన వ్యవహారంపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ అంశంపై వైసీపీ నాయకుడు గిరి, టీడీపీ నాయకులు గురునాథ్, సుధాకర్, నాగరాజు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తనపై దాడి జరిగే అవకాశం ఉందంటూ వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే బి. విరూపాక్షికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఈ సమాచారంతో ఎమ్మెల్యే విరూపాక్షి తన సోదరుడు శ్రీరాములు, కుమారుడు చంద్రశేఖర్‌తో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులతో గ్రామానికి చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు గురునాథ్ ఇంటి వద్ద ఇరువర్గాల మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగి, అది క్షణాల్లోనే రాళ్లదాడులకు దారితీసింది. కొంతసేపు ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు గాయపడినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అలూరు సీఐ రవిశంకర్ రెడ్డి పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా, గ్రామం నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తం వాహనంపై దాడి జరిగి ధ్వంసమైనట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ సమయంలో పురుషోత్తం వాహనంలో లేరని సమాచారం. ఈ ఘటన అనంతరం ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ కార్యకర్త ఇంటిని ముట్టడించి ఉద్రిక్తత సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, తమ కార్యకర్తపై దాడి జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించినట్లు సమాచారం.
ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, ఇరువర్గాల ఫిర్యాదులను నమోదు చేసి వాస్తవాలను పరిశీలిస్తున్నామని అలూరు సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఘర్షణకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం నేమకల్లు, సంగాల గ్రామాల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
