యాపిల్ సాగుపై రైతులకు క్షేత్ర ప్రదర్శన

తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని యాపిల్ తోటలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జైనూర్, సిర్పూర్ (యు) మండలాలకు చెందిన సీతాగొంది, పంగిడి, పుల్లార, దేవుడుపల్లి తదితర గ్రామాల రైతులు యాపిల్ తోటను సందర్శించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రైతు కె. బాలాజీ రైతులకు పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించారు. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు సాగు చేయడం, సేంద్రీయ పద్ధతుల్లో పంటలు పండించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని వివరించారు.

జీవామృతం, ఘనామృతం, పంచగవ్య, అగ్నిస్త్రం వంటి సహజ ద్రవణాలను రైతులు స్వయంగా తయారు చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ మేనేజర్ ఆర్. గణేష్, బి. సందీప్, రైతు సంఘం నాయకులు పి. జంగు, దత్తు, మారుతి, రైతులు పాల్గొన్నారు.