భారతీయ టెక్కీలకు భారీ షాక్

భారతీయ టెక్కీలకు భారీ షాక్
- యూఎస్ కాంగ్రెస్ ముందుకు బిల్లు
- చట్టంగా మారితే భారతీయ టెక్కీలకు కష్టాలు
- ఇప్పటికే వీసాల సంఖ్య 65 వేల నుంచి 25 వేలకు తగ్గింపు
- గ్రీన్‌కార్డ్‌పై ఆశలు ఆవిరి.. ఐటీ నిపుణుల్లో ఆందోళన
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల డాలర్ కలకు చెక్ పడే పరిస్థితి ఏర్పడుతోంది. హెచ్-1బీ వీసా ఇప్పుడు అందని ద్రాక్షలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. రిపబ్లికన్ సభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో “End H-1B Visa Abuse Act-2026” బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మూడేళ్ల పాటు హెచ్-1బీ వీసాల జారీని నిలిపివేస్తారు. ఈ ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకోవాలనుకునే భారతీయ యువత ఆశలు దెబ్బతింటాయి.
బిల్లులో ఏముంది?
అరిజోనా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలి క్రేన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మరో ఏడుగురు రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలిపారు. మూడేళ్ల పాటు కొత్త హెచ్-1బీ వీసాలకు పూర్తి విరామం ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. అమెరికన్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందని ఈ చర్య అవసరమని బిల్లు పేర్కొంటోంది. ప్రస్తుతం హెచ్-1బీ వీసాల సాధారణ కోటా 65 వేలుండగా, దాన్ని 25 వేలకు కుదించాలని సూచించారు. హెచ్-1బీ వీసా కింద నియమించుకునే సంస్థలు ఉద్యోగికి కనీసం సంవత్సరానికి 2 లక్షల డాలర్లు (సుమారు రూ.1.7 కోట్లు) జీతం ఇవ్వాలని కూడా బిల్లులో పేర్కొన్నారు. ఇది భారతీయ ఐటీ కంపెనీలకు పెద్ద దెబ్బగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హెచ్-4 వీసాలకు మంగళం!
హెచ్-1బీ ఉద్యోగుల జీవిత భాగస్వామి, పిల్లలకు ఇచ్చే హెచ్-4 వీసాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. అలాగే వీసాల జారీకి ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతన ఆధారంగా ఎంపిక చేయాలని సూచించారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు ఎక్కువగా ఉపయోగించే స్టాఫింగ్ మోడల్‌పై కూడా ఆంక్షలు విధించాలని బిల్లు పేర్కొంటోంది.
తెలుగు రాష్ట్రాల యువతకు భారీ షాక్!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువతకు బీటెక్, ఎంఎస్, ఐటీ ఉద్యోగాల కోసం అమెరికా ప్రధాన గమ్యస్థానంగా ఉంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డెవ్‌ఆప్స్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో పనిచేసే తెలుగు యువత అమెరికా ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. హెచ్-1బీ వీసాలు నిలిచిపోతే యువత అమెరికా కల వాయిదా పడుతుంది. దీంతో కెనడా, యూకే, ఆస్ట్రేలియా వైపు దృష్టి మళ్లించే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థి రుణాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కన్సల్టెన్సీ ఆధారిత ఉద్యోగ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా వాదన ఏమిటి?
బహుళజాతి సంస్థలు తక్కువ జీతాలతో విదేశీయులను నియమించుకోవడం వల్ల అమెరికన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శలు ఉన్నాయి. వలస టెక్కీలు హెచ్-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా ఉద్యోగాలను రక్షించేందుకు ఈ బిల్లు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
