డీఎస్సీ వివాదంపై వైఎస్సార్సీపీ నిరసన..
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : మెగా డీఎస్సీ స్కామ్ బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామాకు తెరలేపిందని వైఎస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి విమర్శించారు.
శుక్రవారం బాపట్లలోని రథం బజార్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎల్లావుల సోహిత్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ మెరుగ నాగార్జున, కోన రఘుపతి పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, “తొలి సంతకం” అంటూ ప్రచారం చేసిన డీఎస్సీ–2025లో ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అందుకే అది “మెగా డీఎస్సీ” కాదని, “దగా డీఎస్సీ”గా మారిందని వ్యాఖ్యానించారు.
గత రెండేళ్లలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెప్పుకోదగ్గ పనులు చేయలేకపోయిందని, అందుకే మహానాడును పూర్తిగా వైఎస్సార్సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వేదికగా మార్చారని విమర్శించారు.
టీడీపీ మహానాడు సమావేశాలు హాస్యాస్పదంగా మారాయని, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించకుండా కేవలం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. “మహానాడు అంటే నాలుగు బూతులు, నాలుగు విమర్శలు, నాలుగు తిట్లు అన్నట్టుగా మార్చేశారు” అని మండిపడ్డారు.
అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ చెప్పారని, ఏ అంశంపైనైనా చర్చకు తమ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు.
అలాగే రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా “రెడ్ బుక్ రాజ్యాంగం” నడపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, అలాంటి చర్యలు చివరకు టీడీపీకి నష్టమే తెస్తాయని హెచ్చరించారు.
డీఎస్సీ నియామకాలపై మాట్లాడుతూ, 16 వేల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్టును ప్రభుత్వం విడుదల చేయకుండా గోప్యంగా సెల్‌ఫోన్లకు మార్కులు పంపించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. “ఎంత డబ్బు ఇస్తే అంత ర్యాంక్ ఇస్తారా?” అని ప్రశ్నించారు.
టెట్, డీఎస్సీ రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో 421 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ, వారి సర్టిఫికెట్లు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నియామకాలు పారదర్శకంగా జరిగితే పూర్తి వివరాలు విడుదల చేయాలని, లేదంటే మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
డీఎస్సీపై ప్రశ్నించే వారిపై కేసులు పెడతామని విద్యాశాఖ నుంచి హెచ్చరికలు రావడం దారుణమని నేతలు విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
