స్మార్ట్ కిచెన్‌లతో మరింత నాణ్యమైన మధ్యాహ్న భోజనం..

స్మార్ట్ కిచెన్‌లతో మరింత నాణ్యమైన మధ్యాహ్న భోజనం..

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
  • మైలవరం హైస్కూల్‌లో స్మార్ట్ కిచెన్‌కు శంకుస్థాపన.

మైలవరం, ఆంధ్రప్రభ : స్మార్ట్ కిచెన్‌లతో విద్యార్థులకు మరింత నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి చర్యలు చేపట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. మైలవరం మండలంలోని బంద్ ఘర్ ఏరియాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొని సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.50 లక్షల అంచనా వ్యయంతో డి.ఎం.ఎఫ్.టి నిధులతో ఈ స్మార్ట్ కిచెన్‌ను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు తెలిపారు. ఇందులో రూ.35లక్షలు భవన నిర్మాణానికి, రూ.15 లక్షలు వంట చేసే పరికరాలకు వెచ్చించనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుకు స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల పరిశుభ్రమైన వంటగది, ఆధునిక పరికరాలతో రుచికరమైన, పౌష్టికాహారం తయారుచేసే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు.

“విద్యతోనే వికాసం” అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం బలోపేతం చేస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ఇంటరాక్టివ్ ప్యానెళ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు డ్రాపౌట్స్ తగ్గించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు కూడా నూతన బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే వసంత సూచించారు. మెగా డీఎస్సీ ద్వారా 15 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు మేలు చేశామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్మార్ట్ కిచెన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply