జోహార్ పింగళి వెంకయ్య!

  • మువ్వన్నెల జెండా రూపకర్తకు మంత్రి కందుల నివాళులు
  • పింగళి వెంకయ్య విగ్రహా ఆవిష్కరణ

రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: పింగళి వెంకయ్య దేశభక్తి, త్యాగం, దూరదృష్టి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మంత్రి కందుల ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాజమహేంద్రవరం మంగళవారపు పేటలోని పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని రూపొందించి దేశానికి అందించిన మహనీయుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. ఆయన దేశభక్తి, త్యాగం, దూరదృష్టి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

తాను విద్యనభ్యసించిన పాఠశాల ప్రాంగణంలో పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమైన, భావోద్వేగ క్షణమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల వందనం స్వీకరించారు. “జోహార్ పింగళి వెంకయ్య” అంటూ ఆయన ఆశయాలను స్మరించుకున్న మంత్రి, దేశభక్తి విలువలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.