148 మందికి రూ.1.48 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సంతమాగులూరు: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద 148 మంది లబ్ధిదారులకు రూ.1.48 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీ (LOC) పత్రాలను ఆదివారం సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్య చికిత్సలు, అత్యవసర శస్త్రచికిత్సల కోసం పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీ పత్రాలు అందజేస్తూ ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.