మధుర జ్ఞాపకాల మధ్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నాటి గురువులకు ఘన సన్మానం..

పాఠశాలకు గ్రిల్ డోర్ల విరాళం

బల్మూర్, ఆంధ్రప్రభ : ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగభరితంగా గడిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997–98 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

రెండు నెలలుగా వాట్సాప్ వేదికగా పరస్పరం సంప్రదించుకున్న పూర్వ విద్యార్థులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకుని పాఠశాల రోజుల్లో చేసిన అల్లరి, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు, గురువుల బోధనలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా మార్గనిర్దేశం చేసిన గురువులు నర్సోజి, నరసింహారావు, రామోజీ, భాగ్యలక్ష్మి, వెంకట్రామిరెడ్డిలను ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

“గాలిపటానికి దారం ఎంత ముఖ్యమో.. విద్యార్థి జీవితానికి గురువు అంతే ముఖ్యుడు” అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. తమ విజయాలకు తల్లిదండ్రులు, గురువులు, పాఠశాలే మూలాధారమని కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాల వంటగదికి గ్రిల్ డోర్లను పూర్వ విద్యార్థులు విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సత్యప్రసాద్ అధ్యక్షత వహించగా, గౌరవ అధ్యక్షుడిగా సత్పాల్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమ సమన్వయంలో మల్లేష్, జగదీష్, రఫీ, హిదాయత్, విజయరెడ్డి, సావిత్రి, శైలజ, షబానా, నరసింహ తదితరులు కీలక పాత్ర పోషించారు.

కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.