వరద కాలువలోకి గోదావరి జలాలు..
బీఆర్‌ఎస్ శ్రేణుల హర్షం
కేసీఆర్, ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నాయకులు, రైతులు
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి–మోర్తాడ్ మండలాల సరిహద్దులోని తిమ్మాపూర్ బ్రిడ్జి వద్ద వరద కాలువలోకి రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలు చేరడం పట్ల ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కమ్మర్‌పల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్ అన్నారు.

ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు ఆదివారం పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు.
రేగుంట దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్‌రెడ్డి రైతుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో రివర్స్ పంపింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
రివర్స్ పంపింగ్ వల్ల ఏడాది పొడవునా వరద కాలువలో నీరు అందుబాటులో ఉండేదని, దీంతో మెట్‌పల్లి, వేములవాడ, జగిత్యాల, బాల్కొండ ప్రాంతాల రైతులు రబీ, ఖరీఫ్ పంటలకు సమృద్ధిగా సాగునీరు వినియోగించుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తూ రివర్స్ పంపింగ్‌ను నిలిపివేసిందని ఆరోపించారు. గత రెండున్నర సంవత్సరాలుగా చేసిన ఆరోపణలకు ప్రస్తుతం వరద కాలువలో ప్రవహిస్తున్న నీరే సమాధానమని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువకు గ్రామానికి ఒక అడుగు తూము మాత్రమే ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద తూములు ఏర్పాటు చేసి వారం రోజుల్లోనే చెరువులు నిండేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.
ప్రస్తుతం వరద కాలువలోకి నీరు చేరుతున్న నేపథ్యంలో తక్షణమే తూములను తెరిచి ఆయకట్టు గ్రామాల చెరువులను నింపాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు బద్ధం అశోక్, యాల్ల హన్మంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపీటీసీ అశోక్, సంత నడిపి రాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, ప్రభుదాస్, దొంకల్ గంగారెడ్డి, పిప్పర అనిల్, అవారి మురళి, రఘు, జైపాల్‌తో పాటు రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
