Chintoor-Agency-Floods : బతుకు జీవుడా..! Andhra Prabha Top Story
Chintoor-Agency-Floods : బతుకు జీవుడా..! Andhra Prabha Top Story
- ఊపిరి పీల్చిన ఏజెన్సీ
- వడివడిగా వెనక్కి వరద..!!
- ఇక కష్టాలు ఎదురీత
- వరద నీటిలోనే రహదారులు
- రాకపోకలకు బ్రేక్
- లోతట్టు గ్రామాలను చుట్టు ముట్టిన వరద
- సహాయక చర్యల్లో అధికారయంత్రాంగం
- వరద బాధితులకు కలెక్టర్ దినేష్ భరోసా

( చింతూరు (పోలవరం జిల్లా), ఆంధ్రప్రభ)
పోలవరం (రంపచోడవరం) జిల్లా చింతూరు ఏజెన్సీలో ఒక్కసారిగా వచ్చి పడిన వరద వడివడిగా వెనక్కి తగ్గి తగ్గుముఖం పట్టడంతో మన్యం వాసులు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో చింతూరు ఐటీడీఏ పరిధిలోని మన్యంలో శబరి, గోదావరి నదులు ఒక్కసారిగా ఉపద్రవం సంభవించినట్లు శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించాయి. గత గురువారం మొదలైన వరద మూడు రోజులు పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పెరుగుతూ వచ్చింది.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం నెమ్మదిగా అటు గోదావరి ఇటు శబరి నదుల వరద తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో చింతూరు వద్ద శబరి నది 41 అడుగుల నీటి మట్టం నుండి 40 అడుగుల నీటి మట్టానికి, భద్రాచలం వద్ద 56.20 అడుగుల గరిష్ట నీటి మట్టం నుండి 46.20 అడుగులకు చేరి సుమారు 10 అడుగులు తగ్గింది. కూనవరం వద్ద సైతం గోదావరి మెల్ల్లగా తగ్గుముఖం పడుతుంది. కూనవరం వద్ద గోదావరి 52.50 అడుగుల నుండి 51 అడుగులకు చేరుకుంది. చింతూరు మండల కేంద్రంలోని సంతపాకలు, లారీయూనియన్ కార్యాలయ సమీపంలోకి, విఆర్ పురం మండలంలోని వడ్డిగూడెం, శ్రీరామగిరి, కూనవరం మండలంలోని కూనవరం, శబరి కోత్తగూడెం గ్రామాల్లోకి వరద చేరింది.
Chintoor-Agency-Floods : వరద ప్రభావితం ఇలా

ఈ వరదల నేపధ్యంలో చింతూరు ఐటీడీఏ పరిధిలోని నాల్గు మండలాల్లో సుమారు 10 గ్రామాలు వరద ప్రభావితానికి గురికాగా, 9 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో 608 కుటుంబాలు వరద ప్రభావితానికి గురివ్వగా, 563 గృహాల్లో వరద నీరు చేరింది. మొత్తం 1683 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద వలన 44 రహదారుల మీద వరద నీరు చేరగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Chintoor-Agency-Floods : రహదారులపైనే వరద నీరు

శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ నదులకు అనుసంధానమైన చింతూరు మండలంలోని ఆంధ్రా – ఒరిస్సా రాష్ట్రాల మధ్య ఉన్న కుయుగూరు వాగు పొంగి జాతీయ రహదారి 326పై వరద నీరు చేరడంతో ఆంధ్రా – ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు స్థంబించాయి. చింతూరు – విఆర్ పురం మండలాల ప్రధాన రహాదారిలో సోకిలేరు, చీకటీ వాగులు, జల్లివారి గూడెం వాగులు ఇంకా రహాదారిపైనే వరద నీరు ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్మూరు పంచాయతీ పరిధిలోని చంద్రవంక చట్టీ – కుమ్మూరు గ్రామాల మధ్య రహదారిపై చేరుకోవడం మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా కూనవరం – ఎటపాక మండలాల మధ్య ప్రధాన రహదారిపై మూరుమూరు, నందిగామ, పోలిపాక గ్రామాల వద్ద వరద నీరు రహదారిపై, ఎటపాక – భద్రాచలంల మధ్య జాతీయ రహదారి 30 పై నెల్లిపాక, రాయనపేట గ్రామాల వద్ద గోదావరి వరద రహదారిపై చేరడంతో కూనవర, ఎటపాక మండలాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా రాకపోకలు నిలిచిపోవడంతో చింతూరు గ్రామ శివారు ప్రాంతంలో అధిక సంఖ్యలో లారీలు ఎక్కడక్కడ ఆగిపోయాయి.
Chintoor-Agency-Floods : సహాయక చర్యల్లో అధికారులు

ఏజెన్సీలో వరద నేపధ్యంలో పోలవరం (రంపచోడవరం) జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మూడు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద బాధితులకు అండగా ఉంటూ భరోసా కల్పించారు. వరద సహాయక చర్యల్లో భాగంగా ప్రభావిత గ్రామాలకు దారులు లేకపోయిన ట్రాక్టర్లు, పడవలు, అవసరమైన ప్రాంతాల్లో కాలినడకన వెళ్ళి బాధితులకు మేమున్నాం అనే భావన కల్పించారు. వరద తగ్గుతున్న నేపధ్యంలో తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు ఆరోగ్య సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఈ సహాయక కార్యక్రమాలకు గాను 34 మంది నోడల్ అధికారులను, 11 మంది పర్యవేక్షణాధికారులను నియమించి వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.

కలెక్టర్‌తో పాటు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్, డీఆర్వో అంబేద్కర్, జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు, తహాసీల్దార్లు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
