మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి..
కడెం, ఆంధ్రప్రభ : ప్రజలు, ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు.
గురువారం “గంజాయి గస్తీ – రోడ్డు భద్రత అవగాహన సదస్సు”లో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎస్పీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళల భద్రత, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలపై వివరించి అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించి వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.
18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ విజయలక్ష్మి, ఏపీడీ గోవర్ధన్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ సీఐ అజయ్, ఈజీఎస్ ఏపీఓ జయదేవ్, ఎస్సైలు సాయికిరణ్, సాయికుమార్, హనుమంతులు, షీటీమ్ ఎస్సై సుమాంజలి, సర్పంచ్ ఈదుల తిరుపతి, ఉప సర్పంచ్ రమ్య-రవీందర్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, ఈజీఎస్ ఈసీ శ్రీనివాస్, టీఏలు జాడీ కాంతారావు, గణేష్, ఫీల్డ్ అసిస్టెంట్ తుప్ప రాజలింగం, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, పోలీసు సిబ్బంది, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
